Supreme Court: మార్కుల గణనపై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు

నీట్‌ - యూజీ 2024లో అవకతవకలపై దాఖలైన పిటిషన్లకు నేడు సుప్రీంకోర్టు స్పందించింది. ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. 

Published : 27 Jun 2024 15:06 IST

ఇంటర్నెట్‌డెస్క్: నీట్‌-యూజీ 2024 (NEET-UG 2024)లో అవకతవకలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ)కు గురువారం నోటీసులు జారీ చేసింది. జులై 8వ తేదీలోగా దీనికి తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నీట్‌-యూజీ 2024పై వచ్చిన మిగిలిన పిటిషన్లతో కలిపి అదేరోజు విచారణ చేపడతామని పేర్కొంది. 

నీట్‌-యూజీ 2024 మార్కుల గణనలో ఇష్టారీతిన వ్యవహరించారంటూ పిటిషన్‌ను ఓ లెర్నింగ్‌ యాప్‌ దాఖలు చేసింది. మెడికల్‌ పరీక్షకు హాజరైన చాలామంది ఓఎంఆర్‌ షీట్లను పొందలేదని పేర్కొంది. దీనిపై నేడు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీ బెంచ్‌ నేడు వాదనలను వినింది. ‘‘ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వడానికి ఏమైనా టైమ్‌లైన్‌ను మీరు పెట్టుకొన్నారేమో తెలియజేయండి. దీనిపై ఎన్‌టీఏను స్పందించనీయండి’’ అని బెంచ్‌ పేర్కొంది. సంబంధిత పార్టీలు ఈ అంశంపై జులై 8వ తేదీ లోగా వివరణలు పంపాలని ఆదేశించింది. 

అదే సమయంలో కోచింగ్‌ సెంటర్లు పిటిషన్లు దాఖలు చేయడాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. ‘‘ఇది కోచింగ్‌ సెంటర్ల వైపు నుంచి వచ్చిన 32వ పిటిషన్‌. ఇందులో మీ ప్రాథమిక హక్కులకు ఏం ఉల్లంఘన జరిగింది..? ఈ అంశంలో వారు పోషించడానికి ఏ పాత్ర కనిపించడం లేదు. చెప్పిన సేవలు అందించడంతోనే వారి పాత్ర ముగుస్తుంది. కేంద్రం చేయాల్సిన పనులను వారు చూడాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది. 

ఓవైపు సుప్రీంలో విచారణ జరుగుతుండగా.. మరోవైపు సీబీఐ దర్యాప్తూ జోరందుకుంది. నీట్‌ లీకులకు సంబంధించిన పలు అనుబంధ కేసులను పరిశీలిస్తోంది. ఈ కేసులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలో అవకతవకలకు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని