Sudha Murty: స్త్రీ, పురుషులిద్దరూ సమానమే కానీ.. : లింగ సమానత్వంపై సుధామూర్తి ఏమన్నారంటే..?

రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty) లింగ సమానత్వం గురించి తనదైన వివరణ ఇచ్చారు. 

Updated : 28 Jun 2024 12:12 IST

దిల్లీ: ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, వితరణశీలిగా పేరుగాంచిన సుధామూర్తి (Sudha Murty) లింగ సమానత్వంపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్) ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.

‘‘అసలు సమానత్వం అంటే ఏమిటి? మొదట దానికో నిర్వచనం ఉండాలి. స్త్రీ, పురుషులిద్దరూ వేర్వేరు. వారిద్దరూ ఒక సైకిల్‌కు ఉన్న రెండు చక్రాల్లాంటివారు. ఒక చక్రం సహాయం లేకుండా ఇంకో చక్రం ముందుకు వెళ్లలేదు. అందుకే వారిద్దరూ సమానమే. కానీ, వారివారి మార్గాల్లో వారు ప్రత్యేకంగా ఉంటారు. మహిళలకు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంటుంది. పరిస్థితుల్ని చక్కబెట్టగలరు. అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. అదే పురుషుల విషయానికివస్తే.. వారి తీరు ఇంకోరకంగా ఉంటుంది. వారి ఇంటిలిజెంట్‌ కోషెంట్(ఐక్యూ) బాగుంటుంది. అయితే వారు మహిళలంత ఎమోషనల్‌గా ఉండరు’’ అంటూ తన కోణంలో లింగ సమానత్వాన్ని వివరించారు.

దీనిపై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు. ‘’మీరు చెప్పింది నిజం మేడమ్,  ఇద్దరూ ఉంటేనే ఈ ప్రకృతి పరిపూర్ణంగా ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. ఇదిలాఉంటే.. ఇటీవల సుధామూర్తి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి తనకు ఓసారి ఫోన్‌ వచ్చిందని, తానే దాన్ని నమ్మలేక ‘రాంగ్‌ నంబర్‌’ అని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ‘ఐటీ డివైడ్‌’ అనే అంశంపై తాను రాసిన కాలమ్‌ను కలాం చదివారని, అది బాగుందని చెప్పేందుకే కాల్‌ చేశారని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని