Odisha CM: మోదీ బర్త్‌డే వేళ ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజున ఒడిశాలో ‘సుభద్ర యోజన’ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం మాఝి వెల్లడించారు.

Published : 30 Jun 2024 21:51 IST

భువనేశ్వర్‌:  ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మేనిఫెస్టోలో ప్రకటించిన ‘సుభద్ర యోజన’ పథకాన్ని మోదీ పుట్టిన రోజున (సెప్టెంబర్‌ 17న) ప్రారంభించనున్నట్లు సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు భాజపా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రూ.50వేలు చొప్పున గిఫ్ట్‌ ఓచర్‌ పంపిణీకి ఉద్దేశించిన సుభద్ర యోజన పథకం ప్రధాని పుట్టిన రోజున ప్రారంభిస్తామన్నారు. పూరీ జగన్నాథుడి రత్న భాండగారాన్ని త్వరలోనే తెరవనున్నట్లు వెల్లడించారు. స్వామివారి విలువైన వస్తువుల జాబితాను తయారు చేస్తామని.. అందులో ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. 

ఇటవల ఎన్నికల్లో భాజపా తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ప్రభుత్వ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పొందుపరుస్తుందన్నారు. ఒడిశాలోని రైతుల నుంచి ఈ ఖరీఫ్‌ సీజన్‌కు క్వింటాల్‌ వరి సేకరణకు రూ.3,100 మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు. ఒడిశాలో తమ పార్టీ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రకటిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్‌ సమాల్‌ తెలిపారు. భాజపా సర్కారు తన తొలి క్యాబినెట్‌లో తీసుకున్న నాలుగు ప్రధాన నిర్ణయాలు కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. చిత్రాన్ని చూసేందుకు 100వ రోజు వరకు వేచి చూడాలని సూచించారు. తమ పార్టీకి అధికారం ఇచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మరింత కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు