Bombay HC: ప్రధాని, వీఐపీల కోసమేనా..? నిత్యం ఎందుకు చేయరు? - హైకోర్టు

ప్రధాన మంత్రి, ఇతర వీవీఐపీలు వచ్చినప్పుడు వీధులు, ఫుట్‌పాత్‌లు క్లియర్‌గా ఉంచడం సాధ్యమైనప్పుడు.. సామాన్యుల కోసం నిత్యం ఎందుకు ఉంచరని బాంబే హైకోర్టు ప్రశ్నించింది.

Published : 24 Jun 2024 18:38 IST

ముంబయి: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, మునిసిపల్‌ అధికారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి, ఇతర వీవీఐపీలు వచ్చిన రోజు వీధులు, ఫుట్‌పాత్‌లు క్లియర్‌గా ఉంచడం వీలైనప్పుడు.. సామాన్యుల కోసం నిత్యం ఎందుకు అలా ఉంచరని ప్రశ్నించింది.

‘‘ప్రధానమంత్రి లేదా ఇతర వీవీఐపీలు వచ్చినప్పుడు.. వీధులు, ఫుట్‌పాత్‌లను తక్షణమే శుభ్రం చేస్తారు. వాళ్లు ఇక్కడ ఉన్నంతవరకు అలాగే ఉంచుతారు. అలా ఎలా చేయగలుగుతున్నారు? అందరికోసం ఎందుకు చేయలేకపోతున్నారు. పన్నులు కట్టేది పౌరులు. వారు నడిచేందుకు సురక్షితమైన స్థలం, మంచి పాదచారుల బాట ఉండాలి. ఇది ప్రతిఒక్కరి ప్రాథమిక హక్కు. అవే లేకుంటే వాటిపై నడవాలని మన పిల్లలకు ఏం చెబుతాం. అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గాలు అవే దొరుకుతాయి’’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

సామాన్యుడి ఇంగితం...! ప్రజాస్వామ్య సంతకం

ముంబయిలో వీధివ్యాపారులు, ఆక్రమణల సమస్యను బాంబే హైకోర్టు గతేడాది సుమోటోగా స్వీకరించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ప్రభుత్వం, మునిసిపల్‌ అధికారుల తీరుపై మండిపడింది. ఈ అంశాన్ని క్రమంగా కాలగర్భంలో కలిపేయాలని నగరపాలక సంస్థ యత్నిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు విధించే జరిమానాలు నామమాత్రంగానే ఉంటున్నాయని పేర్కొంది. ఫుట్‌పాత్‌ ఆక్రమణల నివారణకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదని, సత్వరమే ఈ అంశంపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని