Madras HC: న్యాయమూర్తులకు శాలువాలు, గిఫ్టులు ఇవ్వద్దు..!

హైకోర్టు న్యాయమూర్తులను న్యాయశాఖ అధికారులు కలిసినప్పుడు శాలువాలు, బహుమతుల వంటివి ఇవ్వద్దని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 26 Jun 2023 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యాయశాఖ అధికారుల ప్రవర్తనా నియమావళికి సంబంధించి మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) పలు కీలక సూచనలు చేసింది. న్యాయమూర్తులను కలిసినప్పుడు శాలువాలు, పుష్ఫగుచ్ఛాలు, ఇతర బహుమతులను ఇవ్వద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్ల కోసం న్యాయమూర్తుల నివాసాలకు వెళ్లవద్దని కూడా సూచించింది. అధికారుల ప్రవర్తనా నియమావళికి (Code of Conduct) సంబంధించి తమిళనాడు స్టేట్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌, పుదుచ్చేరి జ్యుడిషియల్‌ సర్వీస్‌ అధికారులకు మద్రాస్‌ హైకోర్టు సర్క్యులర్‌ జారీ చేసింది.

‘హైకోర్టు న్యాయమూర్తులను కలిసే సమయంలో వారికి శాలువాలు, మొమెంటోలు, పుష్ఫగుచ్ఛాలు, పండ్లు, ఇతర బహుమతులను ఇవ్వడాన్ని న్యాయాధికారులు నిలిపివేయాలి’ అని మద్రాస్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఇంఛార్జ్‌) పేరిట ఓ సర్క్యులర్‌ జారీ అయ్యింది. పనివేళల్లో అధికారులు కోర్టు ప్రాంగణాన్ని వీడవద్దని.. ఎవరైనా న్యాయవాది లేదా కక్షిదారు నుంచి ఎటువంటి ఆతిథ్యం కూడా స్వీకరించవద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా న్యాయమూర్తులను అధికారులు నేరుగా సంప్రదించవద్దని, కేవలం రిజిస్ట్రీ ద్వారానే కమ్యూనికేషన్‌ జరగాలని సర్క్యులర్‌లో పేర్కొంది.

వీటితోపాటు అధికారుల డ్రెస్‌కు సంబంధించి కూడా మద్రాస్‌ హైకోర్టు పలు సూచనలు చేసింది. కోర్టు ప్రాంగణం బయట ఉన్నప్పుడు నలుపురంగు కోట్‌, టై ధరించవద్దని సూచించింది. అన్ని న్యాయస్థానాల్లో ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌/డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌/విభాగాధిపతులను మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని