PM Modi: మణిపుర్‌పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం

PM Modi: మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపాలని విపక్షాలకు గట్టిగా చెప్పారు.

Updated : 03 Jul 2024 15:29 IST

దిల్లీ: ‘మణిపుర్‌’ అంశం (Manipur Issue)పై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తోన్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దీనిపై స్పందించారు. ఆ ఈశాన్య రాష్ట్రంలో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ విపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మణిపుర్‌ అంశాన్ని ప్రస్తావించారు.

‘‘మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మా ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ జరిగిన అల్లర్లపై ఇప్పటివరకు 11,000 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కేంద్ర మంత్రి కొన్ని వారాల పాటు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వరదలు తలెత్తగా.. సహాయం నిమిత్తం రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించాం’’ అని మోదీ వెల్లడించారు.

ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో మణిపుర్‌ (Manipur)లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తుచేశారు. ఈ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలని అన్నారు. ఇలాంటి విద్వేష రాజకీయాలను ఏదో ఒక రోజు మణిపుర్‌ ప్రజలు తిరస్కరిస్తారని కాంగ్రెస్‌ను హెచ్చరించారు.

రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్‌

బెంగాల్‌ మూకదాడి ఘటన దిగ్భ్రాంతికరం..

ఈసందర్భంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ జంటపై జరిగిన మూకదాడి ఘటనను ప్రధాని ప్రస్తావించారు. ‘‘నడి రోడ్డుపై ఓ మహిళను దారుణంగా కొట్టిన వీడియోలు సోషల్‌మీడియాలో కన్పించాయి. ఆ అన్యాయాన్ని అందరూ కళ్లప్పగించి చూశారే తప్ప.. ఆ సోదరికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీనిపై విపక్షాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాల వైఖరి ఆందోళన కలిగిస్తోంది’’ అని మోదీ (Narendra Modi) దుయ్యబట్టారు.

నీట్‌ లీకేజీ బాధ్యులను వదిలిపెట్టం..

ఇక, నీట్‌ పీజీ పరీక్షలో పేపర్‌ లీకేజీ (NEET Row) అంశంపై మోదీ స్పందిస్తూ.. ‘‘పేపర్‌ లీక్‌ అంశాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా చర్చ జరగాలి. దురదృష్టవశాత్తూ ప్రతిపక్ష సభ్యులు దేశ యువత భవిష్యత్తుపై రాజకీయాలు చేస్తున్నాయి. నీట్‌లో అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రధాని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని