IAS Rohini Sindhuri: ఐఏఎస్‌ రోహిణి సింధూరి నా భూమిని ఆక్రమించారు: బాలీవుడ్‌ సింగర్‌ ఫిర్యాదు

IAS Rohini Sindhuri: ఐఏఎస్‌ రోహిణి సింధూరిపై బాలీవుడ్‌ గాయకుడు కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆమె తన భూమిని అక్రమంగా లాక్కొన్నారని ఆరోపించారు.

Published : 21 Jun 2024 18:16 IST

బెంగళూరు: కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి (IAS Rohini Sindhuri) మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్‌ గాయకుడు లక్కీ అలీ (Singer Lucky Ali) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు.

బెంగళూరు (Bengaluru) శివారులోని యెలహంక ప్రాంతంలో తన వ్యవసాయ భూమిని ఐఏఎస్‌ రోహిణి, ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, బంధువు మధుసూదన్‌ రెడ్డి అక్రమంగా లాక్కొన్నారని లక్కీ అలీ ఆరోపించారు. ఇందుకు కొందరు స్థానిక పోలీసు అధికారులు ఆమెకు సాయం చేసినట్లు తెలిపారు. 2022లోనే దీనిపై తాను కేసు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే తాను లోకాయుక్త పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. గాయకుడి ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా.. గతేడాది ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌తో వివాదంతో ఐఏఎస్‌ రోహిణి సింధూరి (IAS Rohini Sindhuri) వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రోహిణి వ్యక్తిగత చిత్రాలను బయటపెడుతూ ఐపీఎస్‌ రూప చేసిన ఆరోపణలు.. కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రూప ఆరోపణలకు రోహిణి కూడా సోషల్‌ మీడియాలో దీటుగా స్పందించారు. తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసి, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన రూప తనకు క్షమాపణలు చెప్పాలని, దాంతో పాటు రూ.కోటి ఇవ్వాలని రోహిణి డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారం కాస్త తీవ్ర దుమారం రేపడంతో అప్పటి ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంది. వీరిద్దరికీ ఎలాంటి పోస్టులు కేటాయించకుండా బదిలీ వేటు వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని