NEET Paper Leak: నీట్‌ పేపర్‌ లీక్‌ వెనక కుట్రదారు.. ఎవరీ సంజీవ్‌ ముఖియా..?

NEET Paper Leak: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్‌ కేసులో ప్రధాన నిందితుడి కోసం బిహార్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఎవరా సంజీవ్‌ ముఖియా?

Updated : 22 Jun 2024 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్‌ (Bihar) పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ విచారించగా ఓ వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. అతడే సంజీవ్‌ ముఖియా (Sanjeev Mukhiya). ఈ లీకేజ్‌ రాకెట్‌ వెనుక ప్రధాన కుట్రదారు అతడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరతడు..?

పేపర్‌ మొదట అందింది సంజీవ్‌కే

ఈ పశ్నపత్రం (NEET Paper Leak) లీకేజీ వ్యవహారంపై బిహార్‌ పోలీసు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. ఈ రాకెట్‌లో సంజీవ్‌ ముఖియా పాత్ర గురించి అధికారికంగా వెల్లడించనప్పటికీ.. అతడే ప్రధాన కుట్రదారు అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రశ్నపత్రం మొదట అందింది సంజీవ్‌కేనని తెలుస్తోంది. ఓ ప్రొఫెసర్‌ ద్వారా పేపర్‌ తీసుకొని.. రాకీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు.. పట్నాలోని ఓ బాయ్స్‌ హాస్టల్‌ను అద్దెకు తీసుకుని అందులో 25 మంది విద్యార్థులకు వసతి కల్పించాడని సమాచారం. వారందరికీ లీకైన పేపర్‌ ఇచ్చి ప్రిపేర్‌ చేయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పేపర్‌ లీక్‌ వ్యవహారం బయటపడిన తర్వాత మే 6 నుంచి సంజీవ్‌ కన్పించకుండా పోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఎవరీ సంజీవ్‌ ముఖియా

బిహార్‌లోని నలందా జిల్లా నాగర్‌సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్‌ (Sanjeev Mukhiya) తొలుత సాబూర్‌ అగ్రికల్చర్‌ కాలేజీలో పనిచేసేవాడు. అక్కడ పేపర్‌ లీక్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటు వేశారు. ఆ కేసులో కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలందా కాలేజీ నూర్‌సరయ్‌ బ్రాంచ్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరాడు. గతంలోనూ పలు ప్రభుత్వ పరీక్షల పేపర్‌ లీక్‌ కేసుల్లో ఇతడి పేరు బయటకురావడం గమనార్హం.

తండ్రీకొడుకుల.. ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌

సంజీవ్‌ కుమారుడు శివ్‌ కుమార్‌కు కూడా ఈ నేరాల్లో హస్తం ఉంది. వృత్తిరీత్యా వైద్యుడైన శివ్‌.. బిహార్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ ‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి అతడి అసలు పేరు సంజీవ్‌ సింగ్‌. భార్య మమతా దేవీ భుఠాకర్‌ గ్రామ పంచాయతీ ముఖియాగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి స్థానికులు ఇతడిని కూడా ముఖియాగా పిలుస్తున్నారు. సంజీవ్‌ భార్య 2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌ జనశక్తి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఆ ఒక్క ఫోన్‌ కాల్‌తో తీగలాగితే..

మే 5న నీట్‌ యూజీ పరీక్ష (NEET Row) జరిగింది. అదే రోజున బిహార్‌ పోలీసులకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దాంతో ఈ పేపర్‌ లీక్ వ్యవహారం బయటపడిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ‘‘నీట్‌ ప్రశ్నపత్రాన్ని ఓ గ్యాంగ్ లీక్‌ చేసిందని ఝార్ఖండ్‌కు చెందిన సెంట్రల్‌ ఏజెన్సీ నుంచి ఫోన్‌ వచ్చింది. నిందితులు ఉపయోగించిన కారు వివరాలు కూడా తెలిశాయి. దీంతో వెంటనే కారును ట్రాక్‌ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నాం. ఆ తర్వాత తీగ లాగితే ఈ కుంభకోణం బయటపడింది. పేపర్‌ లీక్‌ చేసినందుకు నిందితులు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30లక్షలు-రూ.50లక్షలు వసూలు చేశారు. ఇందులో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నాడు’’ అని పోలీసువర్గాలు వెల్లడించాయి.

పోలీసులకు చిక్కిన ఫిక్సర్‌ రవి..

ఈ పేపర్‌ లీక్‌లో కీలకంగా వ్యవహరించిన మరో నిందితుడు రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇతడు సంజీవ్‌ ముఖియాకు సన్నిహితుడు. నోయిడాకు చెందిన ఇతడు పేపర్‌ లీక్‌లో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. రవి గతంలోనూ పేపర్‌ లీకేజీ కేసులో అరెస్టయ్యాడు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని కోటాలో ఇతడు కోచింగ్‌ తీసుకున్నాడు. 2012లో పరీక్ష పాసై రోహ్‌తక్‌ కాలేజీలో సీటు సంపాదించాడు. అయితే నాలుగో సంవత్సరం పరీక్షలు రాయకుండా వచ్చేశాడు. అప్పటి నుంచి ‘ఎగ్జామ్‌ మాఫియా’ గ్యాంగ్‌తో సంబంధాలు నెరిపాడు. విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను పంపించి పరీక్ష రాయించడం వంటి నేరాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని