Sanjay Raut: కొందరు ఓట్లేస్తే.. ఇంకొందరు చెంప దెబ్బలు కొడుతున్నారు: ఎంపీ సంజయ్ రౌత్

నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌పై దాడి విషయంలో శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం స్పందించారు.

Published : 07 Jun 2024 18:17 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌(Kangana Ranaut)ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడంపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) శుక్రవారం స్పందించారు.

“కొందరు ఓట్లు వేస్తే మరికొందరు తిడుతున్నారు, ఇంకొందరు కొడుతున్నారు. అసలేం జరిగిందో తెలియదు. రైతులు చేసిన ఆందోళనలో మా అమ్మ కూడా ఉందని కానిస్టేబుల్ చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. కన్న తల్లిని ఏమైనా అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ప్రధానమంత్రి మోదీ(PM Modi)  చట్టబద్ధమైన పాలన ఉండాలని చెబుతుంటారు. అలా ఉన్నప్పుడు దానిని చేతుల్లోకి తీసుకోవద్దు ... దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసిన రైతులంతా భారత మాత పిల్లలే. ఎవరైనా వారిని అవమానిస్తున్నారంటే అది ఆలోచించాల్సిన విషయమే. కంగనాపై దాడికి సానుభూతి తెలుపుతున్నాను. ఆమె ఇప్పుడు గౌరవనీయమైన ఎంపీ పదవిలో ఉన్నారు. ఎంపీపై దాడి చేయడం ఎలాగైతే సరైనది కాదో, అలాగే రైతులకు మర్యాద ఇవ్వకపోవడం సరైనది కాదు’’ అని సంజయ్‌ రౌత్‌ మీడియాతో అన్నారు.

గురువారం విమానాశ్రయంలో భద్రతా తనిఖీ చేసుకొని ముందుకువెళుతున్న కంగనను అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌(Kulwinder Kaur) చెంపదెబ్బ కొట్టారు. గతంలో కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలను ఉద్దేశించి కంగన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో విమర్శలకు దారితీశాయి.

వారు రూ.100 కోసం అక్కడ కూర్చున్నారని, నిజమైన నిరసనకారులు కారని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు తననెంతో బాధించాయని కానిస్టేబుల్‌ చెప్పారు. ఆ ఆందోళనలో తన తల్లి కూడా పాల్గొందని, వారు న్యాయం కోసం పోరాడుతుంటే కంగన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు కోపం తెప్పించిందని ఆమె పేర్కొన్నారు. అనంతరం కంగనపై దాడి చేసినందుకు అధికారులు ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని