Sachin Pilot: ఆనాడు రాజీవ్‌ వద్దన్నట్టే.. ఈసారి మోదీ వదులుకోవాలి: సచిన్‌ పైలట్‌

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్‌ (Sachin Pilot) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వ్యవహరించినతీరును గుర్తుచేశారు. 

Updated : 07 Jun 2024 10:55 IST

దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు సూచిస్తున్నాయని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) అన్నారు. అందుకే నరేంద్రమోదీ(Modi) ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించకూడదని వ్యాఖ్యానించారు.

‘‘ఈ ఫలితాల విషయంలో భాజపా ఆత్మపరిశీలన చేసుకోవాలి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సుమారు 200 సీట్లు వచ్చాయి. అప్పుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరగా.. ప్రజల తీర్పు తనకు అనుకూలంగా రాలేదని తిరస్కరించారు. దాంతో అప్పుడు తర్వాత స్థానంలోఉన్న పెద్ద పార్టీకి పిలుపువచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు భాజపా, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్నాయని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 197 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ మాత్రం రాలేదు. జనతాదళ్‌ 143 స్థానాలు దక్కించుకుంది. అప్పుడు వీపీసింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ ఎన్నికల విషయానికి వస్తే.. 293 సీట్లతో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీని దక్కించుకుంది. ఈ కూటమి ప్రధాన పార్టీ భాజపాకు 240 సీట్లు వచ్చాయి. గత రెండుసార్లు కమలం పార్టీ సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌(272) దాటగా.. ఈసారి మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దీని తర్వాత స్థానంలో కాంగ్రెస్‌(99) ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని