Agnipath: అగ్నిపథ్ ఆందోళనలు.. రైల్వే స్టేషన్‌ నుంచి రూ.3లక్షలు ఎత్తుకెళ్లిన అల్లరిమూకలు

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిన్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల వద్ద యువత చేపట్టిన

Updated : 18 Jun 2022 12:20 IST

పట్నా: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిన్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల వద్ద యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే నిరసన ముసుగులో కొంతమంది చోరీలకు పాల్పడ్డారు. బిహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రూ.3లక్షల నగదును ఆందోళనకారులు ఎత్తుకెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

బిహార్‌లోని అర్రాహ్‌ ప్రాంతంలో బిహియా రైల్వే స్టేషన్‌ వద్ద శుక్రవారం యువత ఆందోళనకు దిగింది. స్టేషన్‌లోని దుకాణాలను ధ్వంసం చేశారు. అదే సమయంలో కొందరు ఆందోళనకారులు టికెట్ కౌంటర్‌లోని రూ.3లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిహార్‌లో ఐదు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బిహార్‌ ఉపముఖ్యమంత్రి, భాజపా నేత రేణు దేవి, ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ నివాసాలపై దాడి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టారు. కాగా.. ఆందోళనలకు మద్దతుగా రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) శనివారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

అంబులెన్స్‌పై దాడి..

బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ.. బిహార్‌లో శనివారం కూడా చెదురుమొదురు ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ ఉదయం అర్వాల్‌ జిల్లాలో కొందరు నిరసనకారులు అంబులెన్స్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. పలు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అటు యూపీలోనూ నిన్న హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా.. 260 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

సుప్రీంకు చేరిన ‘అగ్నిపథ్‌’ వివాదం..

ఇదిలా ఉండగా.. అగ్నిపథ్‌ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైనట్లు తెలిసింది. ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ దిల్లీకి చెందిన న్యాయవాది ఒకరు పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేగాక, అల్లర్లపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని