NEET 2024: పరీక్ష నిర్వహణే ‘నీట్’గా లేదు..థర్డ్‌ పార్టీ రివ్యూలో పలు విషయాలు వెల్లడి

నీట్‌-2024 నిర్వహణలో చాలా లోపాలు ఉన్నట్లు థర్డ్‌పార్టీ రివ్యూలో తెలిసింది. చాలాచోట్ల కెమెరాలు, భద్రత కూడా కరవైనట్లు వెల్లడైంది. 

Published : 21 Jun 2024 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన ‘నీట్‌-యూజీ ప్రవేశ పరీక్ష 2024’(NEET 2024)లో తీవ్ర నిర్వహణ లోపాలు ఉన్నట్లు ఎన్‌టీఏ థర్డ్‌పార్టీ రివ్యూలో గుర్తించారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 4,000 కేంద్రాల్లో జరిగింది. వీటిల్లో 399 సెంటర్లను థర్డ్‌పార్టీ స్వయంగా పరిశీలించింది. కొన్నిచోట్ల పరీక్ష జరుగుతున్న గదుల్లో సీసీ కెమెరాలు లేవని.. ఉన్నా కొన్నిచోట్ల పనిచేయడం లేదని గుర్తించారు. ఎన్‌టీఏ నిబంధనల ప్రకారం పరీక్ష గదిలో కచ్చితంగా రెండు కెమెరాలు ఉండాల్సిందే. దీంతోపాటు ఆయా సెంటర్లలో ప్రశ్నపత్రాలను భద్రపర్చినచోట గార్డుల రక్షణ లేని విషయాన్ని గమనించారు.

* ఈ రివ్యూను పరీక్ష జరిగిన రోజునే ఆయా కేంద్రాల్లో నిర్వహించారు. 399 సెంటర్లలో 186 చోట్ల పనిచేస్తున్న రెండు కెమెరాలు లేవు. వాస్తవానికి వీటినుంచి వీటి లైవ్‌ఫీడ్‌ దిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లాల్సిఉంటుంది.

* రివ్యూ బృందం పర్యటించిన వాటిల్లో 68 చోట్ల ప్రశ్నపత్రం భద్రపర్చిన గదికి గార్డులను రక్షణగా నియమించలేదు. నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రం పంపిణీ చేసేవరకు కచ్చితంగా గార్డ్‌ రక్షణ ఉండి తీరాలి. 

* 83 సెంటర్లలో బయోమెట్రిక్‌ జాబితాలో ఉన్న సిబ్బంది.. విధుల్లో ఉన్నవారు వేర్వేరు కావడం గమనార్హం.

పరీక్ష రోజున ఏ సెంటర్‌లోనూ మాల్‌ప్రాక్టిస్‌ వంటివి జరగకుండా చూసేందుకు ఈ రివ్యూను నిర్వహిస్తారు. దీనికింద పరిశీలకులను థర్డ్‌ పార్టీ నియమిస్తుంది. వీరు ఎన్‌టీఏ నిబంధనల అమలుతీరును ఎలాఉందో గమనించి నివేదిక ఇస్తారు. 

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ నిజమేనని తేలింది. ముందురోజు రాత్రే నీట్‌ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్‌లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు లీక్‌కు కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు వసూలుచేసినట్లు వెల్లడైంది. 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని