Ratan Tata: ‘ప్లీజ్‌.. సాయం చేయండి’.. శునకం కోసం రతన్‌ టాటా అభ్యర్థన

రతన్‌ టాటాకు జంతువులంటే ఎంత ప్రేమో మనందరికీ తెలుసు.  జంతువుల కోసం నిర్మించిన ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ శునకాన్ని కాపాడమంటూ ఆయన తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

Published : 27 Jun 2024 13:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ బిలియనీర్లలో ఆయన ఒకరు. గొప్ప మనసున్న టాటా ఎంతోమందికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటి ఆయన ముంబయి వాసులను సహాయం చేయమని కోరారు. ఓ వీధి శునకం ప్రాణాలు కాపాడమంటూ అభ్యర్థించారు. సోషల్‌ మీడియాలో టాటా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

రతన్‌ టాటాకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో మనందరికీ సుపరిచితమే. జంతువుల కోసం ఓ ఆస్పత్రిని కూడా నిర్మించారు. అయితే.. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఏడు నెలల వీధి శునకానికి సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయినా దాని ఆరోగ్యం మెరుగుపడలేదు. అది రక్తహీనతతో పాటు మరికొన్ని సమస్యలతో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ మూగజీవి పరిస్థితిపై టాటా ఆందోళన  వ్యక్తంచేశారు. దాన్ని కాపాడేందుకు సాయం చేయాలని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ముంబయివాసులను కోరారు.

‘‘ఏడు నెలల శునకం మా ఆస్పత్రిలో చేరింది. అది ఎనిమియాతో బాధ పడుతోంది. ఆ మూగజీవాన్ని కాపాడేందుకు మా సిబ్బంది ఎంతో శ్రమిస్తోంది. కానీ.. చికిత్స కోసం శునకానికి దాత రక్తం అవసరమైంది. ముంబయి వాసులారా దయచేసి సాయం చేయండి. మీ వద్ద పూర్తి ఆరోగ్యంతో ఉన్న శునకం నుంచి రక్తాన్ని దానం చేయండి. మీరు సాయం చేస్తారని ఆశిస్తున్నా’’ అని రతన్‌టాటా కోరారు. బాధిత శునకం ఫొటోను షేర్‌ చేసిన ఆయన.. దాతకు ఉండాల్సిన అర్హతలను తెలిపారు.

పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు: పార్లమెంట్‌ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఆయన పెట్టిన పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘నిత్యం బిజీగా ఉండే టాటా.. ఓ వీధి శునకం కోసం ఇంతలా ఆలోచించడం నిజంగా గొప్ప విషయం’’ అని ఒకరు.. ‘‘దాన్ని కాపాడేందుకు ముంబయి తప్పకుండా సాయం చేస్తుంది. మీ మంచి మనసుకు నా సెల్యూట్‌’’ అని మరొకరు.. ‘‘ఈ రోజు మాకు మంచి పాఠాన్ని నేర్పించారు.. మూగ జీవాలను కాపాడేందుకు మీరు చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తినిస్తోంది’’ అని కామెంట్లు గుప్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని