Mrs Chatterjee vs Norway: బిడ్డల కోసం ఓ తల్లి పోరాటం.. నిజ జీవిత మిసెస్‌ ఛటర్జీ కథ తెలుసా..?

బిడ్డల కోసం ఓ తల్లి జరిపిన పోరాటం ఇప్పుడు సినిమాగా రాబోతోంది. నటి రాణీ ముఖర్జీ నటించిన ఈ ‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’(Mrs Chatterjee vs Norway) సినిమా వెనక రియల్ స్టోరీ ఉంది. 

Published : 24 Feb 2023 01:25 IST

ముంబయి: తమ పిల్లల కస్టడీ  కోసం భారత్‌కు చెందిన ఓ తల్లి నార్వే ప్రభుత్వంతో పోరాడింది. ఆ పోరాటం నార్వే, భారత్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది జరిగి సరిగ్గా దశాబ్దం గడిచింది. అప్పుడు ఓ తల్లి జరిపిన పోరాటం.. ఇప్పుడు  ప్రముఖ నటి రాణీ ముఖర్జీ(Rani Mukherjee)ప్రధాన పాత్రలో సినిమాగా రాబోతోంది. ‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’(Mrs Chatterjee vs Norway) పేరిట మార్చి 17న విడుదల కానుంది. అయితే దీని వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటో చూద్దామా..!

భర్త ఉద్యోగం నిమిత్తం పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన భారతీయ జంట నార్వేకు వెళ్లారు. వారే సాగరికా , అనురూప్‌ భట్టాచార్య. వారికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడైన బాబుకు ఆటిజం లక్షణాలు కనిపించాయి. భర్తేకేమో ఉద్యోగంతోనే సరిపోయేది. ఈ క్రమంలో రెండోసారి తల్లికావడం, ఒక్కతే ఇంటిని చూసుకోవడంతో సాగరిక అలసిపోయేది. ఈ క్రమంలో ఆమెకు పిల్లాడిని చూసుకోవడం కష్టంగా మారింది. మరోపక్క నార్వేలో పిల్లల చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పద్ధతులు, ఆచారాలతో సంబంధం లేకుండా అందరూ వాటిని పాటించాలి. ఒక చిన్న దెబ్బ వేసినా, చేత్తో తినిపించినా, పిల్లలకు తల్లిండ్రులకు వేరువేరు పడకలు లేకపోయినా అక్కడ తీవ్రంగా పరిగణిస్తారు. ఇవే సాగరికకు ఇబ్బందిగా మారాయి. ఆమె పిల్లాడిని సరిగా చూసుకోవడం లేదనే సమాచారం నార్వే అధికారులకు అందింది. వెంటనే వారు ఆమె ఇంటికి వచ్చి పరిశీలించారు. అయితే ఆమె నిండు గర్భిణిగా ఉండటంతో అప్పటికి వదిలేసి వెళ్లిపోయారు. మరోపక్క ఆమె బాబును పంపిస్తోన్న ప్లే స్కూల్‌.. ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూనే ఉంది. ఆమె దినచర్య సరిగా లేదని కౌన్సిలింగ్‌కు పిలిచింది.  

కొద్దిరోజులు గమనించిన అనంతరం ఆ చిన్నారులను సరిగా పెంచడం లేదని, అలాగే తల్లితో పిల్లలకు భావోద్వేగ అనుబంధం లేదని చెప్తూ.. నార్వే అధికారులు పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేశారు. వారిని సంరక్షణా కేంద్రంలో ఉంచారు. అలాగే 18 ఏళ్లు నిండేవరకు వారు అక్కడే పెరుగుతారని వెల్లడించారు.  2011లో ఇదంతా జరిగింది. అప్పుడు చిన్నారుల్లో ఒకరి వయసు రెండున్నరేళ్లు కాగా, ఇంకొరికి సంవత్సరం కూడా నిండలేదు. ఈ ఊహించని పరిణామంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తమ బిడ్డలను తాము పెంచుకోలేని దుస్థితి పట్ల దు:ఖించారు. ఈ క్రమంలో పిల్లల పెంపకం విషయంలో సంరక్షణా కేంద్రానికే అనుకూల తీర్పు వచ్చింది. పైగా తమ పిల్లలను తాము చూసుకునేందుకు సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ విషయం నార్వే, భారత్‌లో హెడ్‌లైన్స్‌కు ఎక్కింది. 

ఇదే సమయంలో సాగరిక, అనురూప్ బంధం కూడా బీటలువారింది. ఈ పోరాటంలో భాగంగా 2012లో పిల్లల బంధువుకు కోర్టు వారి కస్టడీని అప్పగించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం కలగజేసుకోవడంతో ఆ పిల్లలను భారత్‌ పంపేందుకు అక్కడి కోర్టు అంగీకరించింది. అయితే వారు ఆ బంధువు దగ్గరే పెరగాలని షరతు విధించింది. చివరకు పశ్చిమ్ బెంగాల్‌కు వచ్చి సాగరిక తన పిల్లల కోసం తన పోరాటాన్ని కొనసాగించింది. 2013 జనవరిలో కోల్‌కతా హైకోర్టు పిల్లలను ఆమె కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది.ఎట్టకేలకు ఆమె బిడ్డలు ఆమె చెంతకు చేరారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఎంతో కాలంగా తన బిడ్డలకు దూరంగా ఉన్న ఆమె.. తన సంతోషాన్ని పట్టలేకపోయారు. 

ఇప్పుడు రాబోతున్న సినిమాలో రాణీ ముఖర్జీ తన పిల్లల కోసం ఇలాగే పోరాడనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు బాలీవుడ్‌ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని