Rajasthan: ప్రచారంలో సవాలు విసిరి.. మంత్రి పదవికి రాజీనామా చేసి..!

తాను బాధ్యత వహించిన స్థానాల్లో భాజపా ఓడిపోవడంతో రాజస్థాన్‌ మంత్రి కిరోడి లాల్‌ మీనా తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 04 Jul 2024 15:23 IST

జైపుర్‌: భాజపా సీనియర్‌ నేత, రాజస్థాన్ (Rajasthan) మంత్రి కిరోడి లాల్‌ మీనా (Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బాధ్యత వహించిన స్థానాల్లో కాషాయ పార్టీ ఓడిపోవడమే అందుకు కారణం. వివరాల్లోకి వెళితే..

కిరోడి మీనా రాజస్థాన్‌ ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో దౌసా సహా ఏడు స్థానాలకు మీనా బాధ్యత వహించారు. ఒకవేళ ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలో భాజపా ఓడిపోయినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రచార సమయంలో వాగ్దానం చేశారు. అయితే.. అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 25 స్థానాలు ఉండగా.. 14 ఎంపీ స్థానాలను మాత్రమే కాషాయ పార్టీ గెలుచుకోగలిగింది.

దౌసా సహా ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయ పతాకం ఎగురవేసింది. మిగితాచోట్ల ఇతర పార్టీలు గెలుపొందాయి. దీంతో చేసిన వాగ్దానం ప్రకారం కిరోడి మీనా తన పదవికి రాజీనామా చేశారు. 10 రోజుల క్రితమే రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

కాగా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాధోపూర్‌ నుంచి మీనా గెలుపొందారు. 200 నియోజకర్గాలకు గాను భాజపా 115 స్థానాలను కైవసం చేసుకొంది. కాంగ్రెస్‌ 66 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్ర కేబినెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవనం, విపత్తు నిర్వహణ, సహాయ, పౌర రక్షణశాఖలకు మంత్రిగా కిరోడి వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని