LS Speaker: స్పీకర్‌పై రాహుల్‌ ఆరోపణలు.. మండిపడ్డ అధికార పక్షం

ప్రధాని మోదీ ముందు వంగి స్పీకర్‌ ఓం బిర్లా నమస్కరించడాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.

Updated : 01 Jul 2024 22:13 IST

దిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్‌సభ స్పీకర్‌, విపక్ష నేత రాహుల్‌ గాంధీ మధ్య వాడీవేడీ సంభాషణ కొనసాగింది. స్పీకర్‌గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే సమయంలో తనతో ఠీవీగా వ్యవహరించిన స్పీకర్‌.. ప్రధాని మోదీ ముందు వంగి నమస్కరించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేపింది. ఇదే సమయంలో స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ.. పెద్ద వాళ్లకు నమస్కరించే సంప్రదాయాన్ని మాత్రమే కొనసాగించానని స్పష్టం చేశారు.

‘‘లోక్‌సభ అధినేత మీరు. మీ మాటలే ఇక్కడ శిరోధార్యం. మీరు స్పీకర్‌గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్న సమయంలో ఓ విషయం గమనించా. నేను కరచాలనం చేసినప్పుడు ఒకమాదిరిగా, ప్రధానమంత్రితో చేతులు కలిపినప్పుడు మరోలా కనిపించారు’’ అని రాహుల్‌ గాంధీ మాట్లాడారు. దీంతో అధికార పక్షం నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తమైంది. ఇది సభాపతిపై ఆరోపణలు చేయడమేనని మండిపడింది.

దీనిపై స్పీకర్‌ మాట్లాడుతూ.. ‘‘ ప్రధానమంత్రి సభాపక్షనేత. పెద్ద వాళ్లను గౌరవించడం అనే సంప్రదాయాన్ని మాత్రమే నేను పాటించాను. వ్యక్తిగత, ప్రజాజీవితంలోనూ ఇలాగే వ్యవహరిస్తా. పెద్దవాళ్లకు నమస్కరించడం, అందర్నీ ఒకేవిధంగా చూడడం నేర్చుకున్నా’’ అని ఓం బిర్లా స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. మీకంటే పెద్దవాళ్లు సభలో ఎవరూ లేరని, సభలో అందరూ మిమ్మల్ని గౌరవించాల్సిందేనని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని