Rahul Gandhi: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ

Hathras Stampede: యూపీలో హాథ్రస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు.

Updated : 05 Jul 2024 15:44 IST

హాథ్రస్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా (Bhole Baba) సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ ఉదయం దిల్లీ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన రాహుల్‌ గాంధీ తొలుత అలీగఢ్‌ చేరుకున్నారు. అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం హాథ్రస్‌ (Hathras) చేరుకుని తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. ఆయన వెంట యూపీ కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ తదితరులు ఉన్నారు.

హాథ్రస్‌ ఘటనలో ఆరుగురి అరెస్టు

జులై 2న హాథ్రస్‌లోని ఫుల్‌రయీలో జరిగిన భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో ఈ పెను విషాదం (Hathras Stampede) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాబా దర్శనానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు భోలే బాబా సత్సంగ్‌లో సేవకులుగా (వాలంటీర్లు) వ్యవహరించారు. తొక్కిసలాట జరిగిన సమయంలో వేదిక లోపల వీరే జనాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టారు. వారు విఫలం కావడంతో తోపులాట జరిగింది. కాగా.. ఘటన తర్వాత నుంచి భోలే బాబా పరారీలో ఉన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని