Anurag Thakur: ఇది రాహుల్‌కి కఠిన పరీక్ష.. అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శలు

లోక్‌సభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికవ్వడం ఆయనకు కఠిన పరీక్షతో సమానమని భాజపా ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఎద్దేవా చేశారు. 

Updated : 01 Jul 2024 17:28 IST

దిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఈ బాధ్యత  కఠిన పరీక్షతో సమానమని భాజపా ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఎలాంటి బాధ్యత లేకుండా రాహుల్ పెత్తనం చెలాయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తున్న సందర్భంగా అనురాగ్‌ కాంగ్రెస్‌ నేతపై ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్‌ గాంధీకి ముందుగా అభినందనలు తెలిపారు. ‘‘సార్వత్రిక ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకులను మరోసారి ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టాయి. గత కొన్నేళ్లుగా ఎలాంటి బాధ్యత లేకుండా ఆయన (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) అధికారం చెలాయించారు. కానీ, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఇది వారికి పరీక్ష. ఇప్పుడు రాహుల్‌ రోజంతా సభలో కూర్చుంటారా?ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ లేరు’’ అని అనురాగ్‌ ఎద్దేవా చేశారు.

లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం

భాజపా నేత మాట్లాడుతున్న సమయంలో సభలో రాహుల్‌ గాంధీ లేకపోవడం గమనార్హం. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్‌ ఎంపీల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా.. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవకతవకలను అనురాగ్‌ ఎత్తి చూపారు. పదేళ్ల మోదీ పాలనను కొనియాడారు. ‘‘కాంగ్రెస్‌ పాలనలో భారత్‌ ఆర్థికంగా బలహీనంగా ఉండేది. ఎన్నో కుంభకోణాలు జరిగాయి. కానీ, మోదీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే ఐదవ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగడమే అందుకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని