IAS: ప్రొబేషనరీ ఐఏఎస్‌ గొంతెమ్మ కోర్కెలు.. కన్నెర్ర చేసిన ప్రభుత్వం

తనకు అధికారిక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ ఓ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో ఆమెను బదిలీ చేశారు.

Updated : 10 Jul 2024 14:51 IST

పుణె: అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఒక ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారి బదిలీ అయ్యారు. ప్రత్యేక వసతులు అందించాలని ఆమె డిమాండ్‌ చేయడంతో వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్‌ (Pooja Khedkar) ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే  తన ప్రైవేట్ ఆడి కారుకు రెడ్-బ్లూ  బీకన్‌ లైట్లు, వీఐపీ(VIP) నంబర్ ప్లేట్‌ ఏర్పాటుచేసుకున్నారు. అంతేకాక కారుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్‌ సైతం అమర్చారు. వీటితోపాటు తనకు వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బంది, కానిస్టేబుల్‌తో ఓ అధికారిక ఛాంబర్‌ను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. 

అంతటితో ఆగకుండా అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన ఛాంబర్‌లో తన నేమ్‌ప్లేట్‌ పెట్టుకొని దాన్ని తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. అక్కడ ఉన్న కుర్చీలు, సోఫాలు, టేబుల్‌లతో సహా అన్ని మెటీరియల్‌లను కూడా తొలగించారు. తన పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను ఆదేశించారు. రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అయిన పూజా ఖేద్కర్ తండ్రి కూడా తన కుమార్తె డిమాండ్‌లను నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయ అధికారులను ఒత్తిడి చేశారు. లేదంటే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

అయితే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రొబేషన్‌లో ఉన్న ట్రైనీ ఐఏఎస్ అధికారులకు వీఐపీ ట్రీట్‌మెంట్, పైన పేర్కొన్న అదనపు సౌకర్యాలేవీ ఉండవు. ఐఏఎస్‌లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటే వారు గెజిటెడ్‌ అధికారులై ఉండాలి. ఈ విషయాన్ని పుణె కలెక్టర్‌ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో పూజా ఖేద్కర్‌ను పుణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. ఆమె తన ప్రొబేషన్‌ కాలం పూర్తయ్యే వరకు వాషిమ్ జిల్లాలో సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 

2023 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌ UPSCలో 841 ర్యాంక్‌ సాధించారు. కాగా ఈ ఘటనపై ఆర్‌టీఐ కార్యకర్త స్పందిస్తూ పలు సందేహాలు లేవనెత్తారు. ‘‘పూజా ఖేద్కర్‌ ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్‌ కోటాలో ఐఏఎస్‌ అధికారిగా సెలక్ట్‌ అయ్యారు.  ఆమె తండ్రికి రూ.40 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రూ.కోట్లలో ఆస్తులు ఉన్నవారు నాన్‌-క్రిమిలేయర్‌ కిందకు ఎలా వస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఆమెకు పలు మానసిక సమస్యలు ఉన్నాయని, ఉద్యోగంలో చేరే సమయంలో మెడికల్‌ టెస్ట్‌లకు కూడా హాజరుకాలేదని ఆరోపించారు. ఇవన్నీ దాటుకొని ఆమె ఎలా ఐఏఎస్‌ అధికారి అయ్యారనేది ఓ ప్రశ్నగా మిగిలిపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని