Rahul Gandhi: రాహుల్‌ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించారు.

Published : 02 Jul 2024 10:26 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగం (Rahul Gandhi Speech in Lok Sabha) తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షం తరఫున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అగ్నివీర్‌, మైనార్టీ తదితర అంశాలపై మోదీ (PM Modi) సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే స్పీకర్‌ ఆయనపై చర్యలు తీసుకున్నారు.

రాహుల్‌ (Rahul Gandhi) ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ (LS secretariat) వెల్లడించింది. సభాపతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, అగ్నివీర్‌, మోదీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు (Expunged) లోక్‌సభ సచివాలయం పేర్కొంది.

హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌

‘జై సంవిధాన్‌’ అంటూ చర్చను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ (Congress Leader Rahul Gandhi) దాదాపు ఒక గంట 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు అధికార పక్షం నుంచి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పదేపదే అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ కూడా రెండుసార్లు ప్రసంగాన్ని అడ్డుకుని రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఈసందర్భంగా సభలో కొన్ని మతపరమైన ఫొటోలను రాహుల్‌ చూపించారు. దీనిపై అధికారపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. ఈ వివాదానికి గానూ ఆయన క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని