Sonia Gandhi: నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు

ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. ఏం మారనట్లుగా ప్రధాని వ్యవహరిస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు.

Published : 29 Jun 2024 20:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వ్యక్తిగత, రాజకీయ, నైతిక పరాజయాన్ని సూచించినప్పటికీ.. అసలేం జరగనట్లుగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యవహరిస్తున్నానని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శించారు. ప్రజాతీర్పును ప్రధాని అర్థం చేసుకున్నారనడానికి ఒక్క ఆధారం కూడా లేదని ఓ వార్తాసంస్థకు రాసిన కథనంలో పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో ప్రభుత్వంతో ఏకాభిప్రాయానికి ‘ఇండియా’ కూటమి అంగీకరించిందని చెప్పారు. సంప్రదాయాలకు అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం న్యాయమని.. అయితే, ఈ అభ్యర్థననూ ప్రభుత్వం తోసిపుచ్చిందన్నారు. పార్లమెంటులో సమతుల్యత, ఉత్పాదకతను పెంపొందించేందుకు విపక్ష కూటమి కట్టుబడి ఉందన్నారు.

‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్‌’.. భాజపా పోస్ట్‌ వైరల్‌

‘‘జూన్ 4న ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయినా, ఏమీ మారనట్లుగా ప్రధాని కొనసాగుతున్నారు. ఆయన ‘ఏకాభిప్రాయం’ విలువను బోధిస్తారు. కానీ, నిందారోపణలకూ అవకాశం కల్పిస్తారు’’ అని సోనియా విమర్శించారు. ప్రధాని, లోక్‌సభ స్పీకర్, భాజపా నేతలు ‘ఎమర్జెన్సీ’ గురించి ప్రస్తావించడాన్ని.. రాజ్యాంగంపై దాడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే యత్నంగా పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విషయంలో 1977 మార్చిలో దేశ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. పార్లమెంటు ద్వారా పూర్తిస్థాయి పరిశీలన జరిగే వరకు కొత్త నేర న్యాయ చట్టాల అమలును నిలిపివేయాలన్నారు. ‘నీట్‌’ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. ‘పరీక్ష పే చర్చ’ చేసే ప్రధాని.. పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై మాత్రం మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని