LK Advani: నవ భారత నిర్మాణ మార్గదర్శకుడాయన: అడ్వాణీకి ప్రముఖుల శుభాకాంక్షలు

భాజపా అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీ (LK Advani)కి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడంపై పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Updated : 03 Feb 2024 16:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భాజపా (BJP) అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీ (LK Advani)కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు.

‘‘భారత అభివృద్ధి స్వాప్నికుడు, నవభారత నిర్మాణ మార్గదర్శకుడు, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం. ఈసందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటినుంచి ఆయన అందించిన మార్గదర్శనం, ప్రత్యేకించి నాపై చూపించిన పుత్ర వాత్సల్యం మరువలేనివి’’ - వెంకయ్య నాయుడు

‘‘ఎల్‌.కె.అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం సంతోషంగా ఉంది. దేశం కోసం ఆదర్శప్రాయమైన కృషి, అసాధారణ సేవ, అంకితభావం కనబరిచి ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఇతరులపై ఆయన చూపించే ఆప్యాయత ఎంతోమందికి ఆదర్శం’’ - చంద్రబాబు నాయుడు

‘‘భాజపా వ్యవస్థాపక సభ్యుడు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉంది. దశాబ్దాల సేవ, నిబద్ధత, నైతికతకు గుర్తింపు లభించింది. జాతీయ సమైక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి అందరిలో ప్రేరణ నింపింది’’  - యోగి ఆదిత్యనాథ్‌

‘‘దేశంలోనే సీనియర్ నాయకుడు, మా మార్గనిర్దేశకుడు ఎల్‌.కె.అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. స్వాతంత్య్రానంతరం దేశ పునర్నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ - నితిన్‌ గడ్కరీ

‘‘ఎల్‌.కె. అడ్వాణీ జీ భారతరత్న పురస్కారానికి పూర్తి అర్హులు. మనదేశంలోని అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. స్వాతంత్య్రం రాక ముందు నుంచే దేశ నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి అమూల్యమైనది. ఇలాంటి దిగ్గజ నాయకులు రాజకీయాల స్థాయిని, గౌరవాన్ని పెంచారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు’’- సినీ నటుడు చిరంజీవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని