Bhole Baba: ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

Bhole Baba: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన తర్వాత నుంచి భోలే బాబా అదృశ్యమయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Published : 04 Jul 2024 10:39 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా (Bhole Baba) సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు చోటుచేసుకోకపోవడం గమనార్హం. మరోవైపు, విషాదం (Hathras stampede) తర్వాత నుంచి భోలే బాబాగా పేరొందిన జగత్‌ గురు సాకార్‌ విశ్వహరి ఆచూకీ తెలియరాలేదు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మెయిన్‌పురిలో నిరామ్‌ కుటీర్‌ ఛారిటబుల్‌ ఆశ్రమంలో అతడు ఉన్నట్లు బుధవారం నుంచి వదంతులు వచ్చాయి. దీంతో పోలీసులు అక్కడ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. కానీ, భోలేబాబా మాత్రం దొరకలేదు. ‘‘ఆశ్రమంలో 40 నుంచి 50 మంది సేవాదార్‌లు ఉన్నారు. అతడు (Bhole Baba) మాత్రం కన్పించలేదు. నిన్నటినుంచి బాబాను ఇక్కడ చూడలేదని స్థానికులు చెబుతున్నారు’’ అని మెయిన్‌పురి డీఎస్పీ సునీల్‌ కుమార్‌ వెల్లడించారు. కాగా.. అతడు రాజస్థాన్‌ వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

సూరజ్‌ పాలే భోలే బాబా!.. జైలుకెళ్లి బయటకొచ్చాక ఆధ్యాత్మికవేత్త అవతారం

తొక్కిసలాట (Hathras stampede) ఘటనపై భోలే బాబా తరఫు న్యాయవాది బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అతడు ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఘటన జరిగిందని.. దాని వెనక అసాంఘిక శక్తుల కుట్ర ఉందని ఆరోపించాడు. ప్రభుత్వం చేపట్టే దర్యాప్తునకు బాబా సహకరిస్తారని తెలిపాడు. అయితే, ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నట్లు సమాచారం. భక్తులను అతడి భద్రతా సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని