PM Modi: రాహుల్‌ పిల్ల చేష్టలు మానుకోవాలి: ప్రధాని మోదీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రవర్తనను సీరియస్‌గా తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. 

Published : 02 Jul 2024 21:19 IST

దిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. మంగళవారం జరిగిన సమావేశంలో రాహుల్‌ తప్పులను ప్రధాని మోదీ (PM Modi) ఎత్తి చూపారు. కాంగ్రెస్‌ నేత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. రాహుల్‌ ప్రవర్తనను సాధారణంగా తీసుకోవద్దని.. ఆ వ్యాఖ్యల వెనక లోతైన కుట్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.

‘‘వరుసగా మూడోసారి ఓడినా కాంగ్రెస్‌లో మార్పు రావడం లేదు. ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ సమీక్షించుకోవడం లేదు. ఫలితాల తర్వాత దేశంలో అల్లర్లు, హింస రాజేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల సానుభూతి పొందేందుకు కొత్త డ్రామాకు తెర తీసింది. చిన్నపిల్లల చేష్టల నుంచి హస్తం పార్టీ నేతలు ఇకనైనా బయటకు రావాలి. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి వారు బెయిల్‌పై బయట ఉన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంపై బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలకు వారు క్షమాపణలు చెప్పాలి’’ అని ప్రధాని ఆరోపించారు.

అదెంతో ప్రమాదకరం..

‘‘అగ్నివీర్‌, మైనార్టీ తదితర అంశాలను తెరపైకి తెచ్చి సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీనియర్‌ నేతలే ఇలాంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే.. పార్లమెంట్‌ క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నేత (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) చేసిన వ్యాఖ్యలను చిన్న పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దు. వారి వ్యాఖ్యల వెనక కుట్ర ఉందనడంలో సందేహం లేదు’’ అని దుయ్యబట్టారు.

మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్‌పై మోదీ సెటైర్లు

‘‘పదేళ్లుగా ఎన్డీయే పాలనను ప్రజలు చూశారు. అందుకే వరసగా మూడోసారి మాకు అధికారాన్ని అందించారు. కానీ, ఈ వాస్తవం కాంగ్రెస్‌కు మింగుడు పడడం లేదు. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, ఆ విషయం పక్కన పెట్టి అధికార పక్షంపై బురద చల్లడంలో బిజీగా ఉంది. ప్రజా తీర్పును నిజాయితీగా స్వీకరించాలని ప్రతిపక్షాన్ని కోరుతున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని