Mann Ki Baat: అమ్మ పేరిట మొక్క

‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు.

Published : 01 Jul 2024 05:14 IST

ప్రతి ఒక్కరూ నాటండి
భూమాతను రక్షించండి
ప్రధాని మోదీ పిలుపు
మూడోసారి బాధ్యతలు చేపట్టాక తొలి ‘మన్‌ కీ బాత్‌’

దిల్లీ: ‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై నమ్మకముంచి ఓట్లేసిన కోట్ల మంది ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ప్రజలంతా ఆల్‌ ద బెస్ట్‌ చెప్పాలని కోరారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక ఆదివారం తొలిసారి నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ మాట్లాడారు. 

అమ్మకు గుర్తుగా..

‘వన మహోత్సవంలో భాగంగా అమ్మ పేరుతో మొక్క నాటండి. నేనూ మా అమ్మ స్మారకార్థం ఒక మొక్క నాటాను. తల్లుల పేరుతో మొక్క నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. చాలా మంది తమ తల్లులను తీసుకుని వెళ్లి మొక్కలను నాటుతున్నారు. తల్లులు చనిపోయిన వారు వారి ఫొటోలను తీసుకుని వెళ్లి మొక్కలను నాటుతున్నారు. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ ప్రచారం భూమాతను రక్షించడానికి సహాయపడుతుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

రాజ్యాంగంపై విశ్వాసం

రాజ్యాంగంపై దేశ ప్రజలు అచంచల విశ్వాసం ఉంచారని, ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించి 65 కోట్ల మంది ఓటేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఓట్లేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సంఘంతోపాటు ఆ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పారు.

క్రీడాకారులకు ఛీర్స్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న క్రీడాకారులకు ప్రధాని ఛీర్స్‌ చెప్పారు. ప్రజలంతా ‘ఛీర్‌ 4 భారత్‌’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ‘టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ప్రతి భారతీయుడి మనసు గెలుచుకున్నారు. ఈసారి ప్రతి క్రీడాకారుడూ శక్తివంచన లేకుండా పతకాల సాధనం కోసం కష్టపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 900 అంతర్జాతీయ పోటీల్లో మన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. త్వరలో నేను వారిని కలవబోతున్నా’ అని మోదీ పేర్కొన్నారు.  

గొడుగులకు ప్రశంస

కేరళలోని అట్టప్పడిలో గిరిజన మహిళలు చేతితో తయారుచేసే కార్తుంభి గొడుగుల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘కార్తుంభి గొడుగులు మారుమూల గ్రామం నుంచి బహుళజాతి సంస్థలకు చేరుకున్నాయి. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి’ అని మోదీ వ్యాఖ్యానించారు. 


సంస్కృత వార్తలకు 50 ఏళ్లు

ఆకాశవాణిలో సంస్కృత వార్తల బులెటిన్‌ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ విజ్ఞానం, సైన్సులో పురాతనమైన ఈ భాష గణనీయ పాత్ర పోషించిందని చెప్పారు. సంస్కృతాన్ని గౌరవిద్దామని, దైనందిన జీవితానికి అనుసంధానించుకుందామని పిలుపునిచ్చారు. 


మన సంస్కృతికి ప్రపంచవ్యాప్త కీర్తి

భారతీయ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలను సంపాదించిందని ప్రధాని మోదీ తెలిపారు. మన హిందీ కార్యక్రమం కువైట్‌ రేడియోలో ప్రసారం కావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.  

  • ‘తుర్క్‌మెనిస్థాన్‌లో ప్రముఖ కవి 300వ జయంతిని గత మే నెలలో జరిపారు. ఈ సందర్భంగా ప్రపంచంలో 24 మంది ప్రసిద్ధ కవుల విగ్రహాలను ఆ దేశాధ్యక్షుడు ఏర్పాటు చేయించారు. అందులో మన విశ్వగురు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విగ్రహం ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. 
  • జూన్‌లో సురినామ్, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ద గ్రెనడైన్స్‌ దేశాలు భారతీయ వారసత్వ ఉత్సవాలను నిర్వహించాయని ప్రధాని వివరించారు. ‘సురినామ్‌లోని భారతీయులు జూన్‌ 5ను ప్రవాసీ దివస్‌గా నిర్వహించారు. సెయింట్‌ విన్సెంట్‌లో మన జనాభా 6,000. వారంతా భారతీయ వారసత్వం పట్ల గర్విస్తుంటారు.జూన్‌ 1ని భారతీయ వారసత్వ దినంగా పాటిస్తుంటారు’ అని మోదీ వివరించారు. 
  • మన దేశ మరో ఘనత అంతర్జాతీయ యోగా దినోత్సవమని, తొలిసారిగా సౌదీ అరేబియాకు చెందిన మహిళ ఒకరు యోగాకు నేతృత్వం వహించారని ప్రధాని తెలిపారు. ఈజిప్టులో యోగాపై చిత్ర ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేశారని చెప్పారు. నైలు నదీతీరంలో లక్షల మంది యోగా చేశారని, ఎర్ర సముద్రంతోపాటు పిరమిడ్‌లవద్ద యోగా కార్యక్రమాలు జరిగాయని వివరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని