Radhika SarathKumar: ప్రధాని మోదీని కలిసిన రాధిక-శరత్‌ కుమార్‌.. ఎందుకంటే..?

రాధిక- శరత్‌ కుమార్ (Radhika SarathKumar) దంపతులు నేడు ప్రధాని మోదీని కలిశారు. ఈ క్రమంలో వారిమధ్య తమిళనాడు రాజకీయాలపై చర్చ జరిగింది. 

Published : 28 Jun 2024 18:54 IST

దిల్లీ: తమిళనాడుకు చెందిన ప్రముఖ నటులు శరత్‌ కుమార్‌, రాధిక (Radhika-Sarathkumar) దంపతులు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ (Modi)ని కలిశారు. తమ కుమార్తె, నటి వరలక్ష్మి వివాహానికి వారు ప్రధానిని ఆహ్వానించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా టికెట్‌పై రాధిక పోటీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సందర్భంగా వారి మధ్య తమిళ రాజకీయాలు ప్రస్తావనకొచ్చాయి.

‘‘నేను ఎన్నికల్లో చాలా బాగా పోరాడానని ప్రధాని మోదీ అన్నారు. మరింత చురుగ్గా ఉండాలని సూచించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పనిచేయడం మొదలుపెట్టాలని చెప్పారు’’ అంటూ రాధిక ఓ జాతీయ మీడియా సంస్థతో వెల్లడించారు. తమిళనాడు ప్రజల కోసం చేయగలిగినదంతా చేస్తామని తామిద్దరం మోదీకి ప్రామిస్‌ చేశామని శరత్‌కుమార్ తెలిపారు.

2006లో రాధిక (Radhika SarathKumar) రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది అగ్ర నాయకత్వం వారిని తొలగించింది. 2007లో వారు ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీని భాజపా (BJP)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు కమలం పార్టీ టికెట్ దక్కింది. అయితే.. ఈ ఎన్నికలో ఆమె ఓటమి పాలయ్యారు. మాణిక్కం ఠాగూర్‌ను విజయం వరించింది.

ఇదిలా ఉంటే.. వరలక్ష్మి త్వరలో వివాహబంధంలో అడుగుపెట్టనున్నారు. మార్చి నెలలో ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖల ఇళ్లకు రాధిక-శరత్‌కుమార్‌, వరలక్ష్మి స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికలు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు