Longest Sea Bridge: దేశంలో అతిపొడవైన సముద్రపు వంతెన.. ప్రారంభించిన మోదీ

దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ (ఎంటీహెచ్‌ఎల్‌)ను ప్రధాని మోదీ(Modi) ప్రారంభించారు.

Updated : 12 Jan 2024 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : వాణిజ్య రాజధాని ముంబయి(Mumbai)లో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ (MTHL)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) శుక్రవారం ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ దీనిని సిద్ధం చేశారు.

మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’(Atal Setu)గా నామకరణం చేశారు. రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా ఈ వంతెనను నిర్మించారు. ముంబయి, నవీ ముంబయిల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా, కొత్తగా నిర్మించిన వంతెనతో 15- 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.

‘11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం’ పాటించనున్న మోదీ

దీనికి ముందు మోదీ నాసిక్‌లో మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. 35 నిమిషాల పాటు రెండు కిలోమీటర్లకుపైగా ఈ రోడ్‌ షో కొనసాగింది. శ్రీ కాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్‌ వద్ద పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. రోడ్‌షోలో మోదీ వెంట మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని