Gaganyaan: మోదీ అంతరిక్షంలోకి వెళ్లగలరా? - ఇస్రో చీఫ్‌ ఏమన్నారంటే!

‘గగన్‌యాన్‌’ మిషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ పేర్కొన్నారు.

Updated : 01 Jul 2024 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే ‘గగన్‌యాన్‌’ మిషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు. మన ప్రభుత్వాధినేతను అంతరిక్షంలోకి పంపించగలిగే శక్తిసామర్థ్యాలు పొందగలిగితే మనందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. గగన్‌యాన్‌కు సంబంధించి ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. మిషన్‌కు సంబంధించి తాజా సమాచారాన్ని వెల్లడించారు. 

‘‘వీఐపీలను పంపించడం ప్రస్తుత దశలో సాధ్యపడదు. ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటే నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందాల్సి ఉంటుంది. మోదీ వంటి ప్రముఖులకు మరెన్నో కీలక బాధ్యతలు ఉంటాయి. ఐఎస్‌ఎస్‌కు వెళ్లే వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోంది’’ అని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు. ఒక ప్రభుత్వాధినేత స్వదేశీ వాహనంలో అంతరిక్షంలోకి అడుగు పెట్టడమనేది మనందరికీ ఎంతో గర్వకారణమన్న ఆయన.. గగన్‌యాన్‌ ద్వారా అలా తీసుకెళ్లే సామర్థ్యాలను పొందగలమనే విశ్వాసం ఉందన్నారు. ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు డాక్టర్‌ సోమనాథ్‌ ఇలా స్పందించారు.

గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగం కాలక్రమం గురించి డాక్టర్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది కీలక దశలో ఉందని, మూడు ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనున్నామని అన్నారు. తొలుత వ్యోమగాములు ఒకరోజు అంతరిక్షంలోకి వెళ్లి.. కక్ష్యలో కొద్దిసేపు గడిపి, తిరిగి భూమికి రావాలి. రెండోది పరికరాలు, అల్గారిథమ్‌ టెస్టులు నిర్వహించాలి. మూడో దశలో ప్రయోగ వేదికను పరీక్షించాలన్నారు. మొత్తంగా వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి ప్రయోగ పరీక్షకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

ఇదిలాఉంటే, ‘గగన్‌యాన్‌’ మిషనల్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి.. మూడు రోజుల తర్వాత భూమి మీదకు వస్తారు. ఇందుకోసం భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లాలను ఎంపిక చేశారు. వీరు భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు