Sam Pitroda: శాం పిట్రోడాకు బాధ్యతలు.. మోదీజీ ఆనాడే చెప్పారు: కిరణ్‌ రిజిజు

Sam Pitroda: ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా శాం పిట్రోడాకు మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయాన్ని ప్రధాని మోదీ ముందే ఊహించారని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు.

Updated : 27 Jun 2024 14:21 IST

దిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ నేత శాం పిట్రోడా (Sam Pitroda)కు పార్టీలో మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ.. కాంగ్రెస్‌ (Congress)పై విమర్శలు గుప్పించారు. ఇలా జరుగుతుందని ప్రధాని మోదీ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు.

‘‘రూపురేఖలనుద్దేశిస్తూ భారతీయులను అవమానపర్చిన రాహుల్‌ గాంధీ సలహాదారును (పిట్రోడా) మళ్లీ కీలక బాధ్యతల్లోకి తీసుకున్నారు. ఇది మమ్మల్ని ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే ప్రధాని మోదీ (PM Modi) దీన్ని ముందుగానే ఊహించారు’’ అని రిజిజు (Kiren Rijiju) రాసుకొచ్చారు. దీంతోపాటు ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతున్న వీడియోను జత చేశారు. అటు భాజపా కూడా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది.

పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు: పార్లమెంట్‌ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

‘‘కొన్నిసార్లు ఆ పార్టీ (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) పక్కా ప్లాన్‌తో ఉంటుంది. వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు. ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది. కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు. అమెరికాలోని వారి గురువు (పిట్రోడా) విషయంలోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు చూడండి..! కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలివి’’ అని మోదీ (Narendra Modi) ఆ వీడియోలో అన్నారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తొలుత వారసత్వ పన్ను విధానం గురించి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత భారతీయుల రూపురేఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు’’ అంటూ ఆయన చేసిన పోలికపై భాజపా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ క్రమంలోనే పిట్రోడా తన పదవికి రాజీనామా చేయగా.. ఇప్పుడు మళ్లీ ఆయననే ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా నియమించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని