Truck Drivers Protest: ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు

Truck Drivers Protest: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తుతున్నారు.

Updated : 02 Jan 2024 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌ ( hit-and-run)’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు (Truck Drivers) చేపట్టిన ఆందోళన (Protest) మంగళవారం కూడా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే, డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత (Fuel Shortage) ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌ (Petrol Bunks)లకు పోటెత్తారు.

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్‌ బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లోనూ ఇదే పరిస్థితి కన్పించింది. కొన్ని చోట్ల అయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయితే, నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.

పురాతన భవంతి కూలుస్తుండగా బయటపడ్డ బంగారు నాణేలు

భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని