English medium: ఇంగ్లిష్‌ మీడియంపై మోజు.. ఆత్మహత్యవంటిది - ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్

అనేకచోట్ల సుశిక్షితులైన ఉపాధ్యాయులు లేనప్పటికీ.. ఇంగ్లిష్‌ మీడియం వైపు తల్లిదండ్రులు ఆకర్షితులు అవుతున్నారని.. ఇటువంటి పరిణామం ఆత్మహత్య సదృశ్యమేనని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ వ్యాఖ్యానించారు.

Published : 18 Jun 2024 19:48 IST

దిల్లీ: అనేకచోట్ల సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ.. ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల వైపు తల్లిదండ్రులు ఆకర్షితులు అవుతున్నారని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామం కోరి కష్టాలను తెచ్చుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలూ నాణ్యమైన విద్య అందిస్తున్నాయని తెలిపారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కంటెంట్ మొత్తం ఇంగ్లిష్‌లో నింపడం పిల్లలను వారి మూలాలు, సంస్కృతి నుంచి దూరం చేయడంతోపాటు విజ్ఞానంపై ప్రభావం చూపుతుందన్నారు.

‘‘ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలవైపు తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు. ఆంగ్లంలో బోధించే టీచర్లు లేకున్నా లేదా సరైన శిక్షణ పొందినవారు లేకున్నా అటువంటి బడులకే పంపిస్తున్నారు. ఇది ఆత్మహత్య కంటే తక్కువేం కాదు. అందుకే మాతృభాషలో బోధించాలని నూతన విద్యా విధానం స్పష్టం చేస్తోంది’’ అని ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్‌ సక్లానీ పేర్కొన్నారు. మాతృభాష ఆధారిత బోధన ఉంటేనే మూలాలను సరిగ్గా అర్థం చేసుకోగలమని చెప్పారు. బహుభాషా విధానం అనేది కేవలం బోధించడానికి మాత్రమే కాదని.. పలు భాషలను నేర్చుకునేందుకు దోహదం చేస్తుందన్నారు.

హింస, విధ్వంసం పాఠ్యపుస్తకాల్లో ఎందుకు

‘‘కంటెంట్‌ మొత్తాన్ని ఆంగ్లంలో నింపేయడం మొదలుపెట్టామో అక్కడే విజ్ఞాన నష్టం వాటిల్లుతుంది. భాష అనేది శక్తినిచ్చేదిగా ఉండాలి. కోల్పోయేవిధంగా ఉండకూడదు. ఇప్పటివరకు మనం కోల్పోయిన దాన్ని బహుభాషా విద్య ద్వారా తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు. ఒడిశాలో గిరిజన విద్యార్థుల కోసం ఛాయాచిత్రాలు, కథలు, పాటలతో కూడిన పుస్తకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. తద్వారా స్థానిక సంస్కృతితోపాటు మాట్లాడటం, నేర్చుకునే నైపుణ్యాలు మెరుగుపరచవచ్చని చెప్పారు.

2020లో నూతన జాతీయ విద్యా విధానం (NEP) అమల్లోకి వచ్చింది. కనీసం ఐదో తరగతి వరకు బోధనా మాధ్యమం స్థానిక లేదా మాతృ భాషలో ఉండేలా చూసుకోవాలని సిఫార్సు చేసింది. ఎనిమిది, ఆ పైతరగతుల్లోనూ మాతృభాషలోనే బోధించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రధాని మోదీ కూడా పలు సందర్భాల్లో ఈ విషయంపై మాట్లాడుతూ.. సామాజిక న్యాయంలో ఇదో ముందడుగు అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని