NEET row: ‘నీట్‌ను రద్దు చేయొద్దు’ - సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు

నీట్‌ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్‌టీఏను ఆదేశించాలని కోరుతూ 56 మంది నీట్‌ ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Updated : 04 Jul 2024 18:17 IST

దిల్లీ: నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీకేజీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా 56 మంది నీట్‌ ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీట్‌ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్‌టీఏను ఆదేశించాలని కోరారు. నీట్‌ వ్యవహారంపై ఇప్పటివరకు 26 పిటిషన్లు దాఖలు కాగా.. వీటన్నింటినీ జులై 8న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

‘‘పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయతీగా, కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుంది. విద్యాహక్కు ఉల్లంఘనకూ దారితీస్తుంది. అందుకే నీట్‌-యూజీని రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్‌టీఏకు ఆదేశాలివ్వాలి’’ అని గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్‌ కోమల్‌ సింగ్లాతోపాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతోపాటు మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

NTA: పారదర్శకతకు పాతర! ఆది నుంచీ విమర్శలు

నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలపై సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జులై 8న విచారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని