PM Modi: ‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన

PM Modi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పీకర్‌ను అవమానిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ చేయొద్దని సూచించారు.

Updated : 02 Jul 2024 11:56 IST

దిల్లీ: కాంగ్రెస్సేతర నేత వరుసగా మూడోసారి ప్రధాని కావడాన్ని హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతోందని నరేంద్రమోదీ (PM Modi) విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సభలో అవమానకర ప్రసంగం చేశారని దుయ్యబట్టారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని.. ఎన్డీయే (NDA) ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సూచించారు.

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ (NDA Parliamentary Party) సమావేశం మంగళవారం జరిగింది. ఈసందర్భంగా అధికార పక్ష ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సమావేశంలో మోదీ (Narendra Modi) ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాకు వెల్లడించారు.

రాహుల్‌ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు

‘‘నిన్న పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్‌ స్థానాన్ని ఆయన అవమానించారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది. పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్‌ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’’ అని ప్రధాని ఎంపీల (NDA MPs)కు సూచించినట్లు రిజిజు తెలిపారు.

ఎంపీలు తాము మాట్లాడాలనుకున్న అంశంపై ముందుగానే అధ్యయనం చేయాలని మోదీ తెలిపారు. మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండాలని, దేశ సేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు