Lok Sabha: ‘నీట్‌’పై చర్చకు విపక్షాల పట్టు.. లోక్‌సభ సోమవారానికి వాయిదా

Lok Sabha: నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.

Updated : 28 Jun 2024 16:13 IST

దిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘నీట్‌ పేపర్‌ లీక్ (NEET Paper Leak)’ వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేయడంతో లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభల్లో శుక్రవారం గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.

ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్‌ చర్చను ప్రారంభించగా.. ప్రతిపక్షాలు నీట్‌ అంశాన్ని (NEET Row) లేవనెత్తాయి. నీట్ పేపర్‌ లీక్‌ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి (జులై 1) వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

నీట్‌ కేసులో సీబీఐ దూకుడు

అటు రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే గందరగోళం కన్పించింది. నీట్‌ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమ కొంతసేపు ఛైర్మన్‌ సభను నడిపించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. వారి నిరసనల నడుమే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చను చేపట్టారు.

అంతకుముందు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నీట్‌ పేపర్‌ లీక్‌ సమస్య.. దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశం. దానిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోదీ చేపట్టాలి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంట్‌ ఇవ్వాలి’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని