Lok Sabha: సభలో ‘ఎమర్జెన్సీ’ దుమారం

లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం చేసిన ప్రసంగం సందర్భంగా ఎమర్జెన్సీపై ఓం బిర్లా చదివిన తీర్మానం సభలో తీవ్ర దుమారం రేపింది.

Updated : 27 Jun 2024 05:58 IST

దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం చేసిన ప్రసంగం సందర్భంగా ఎమర్జెన్సీపై ఓం బిర్లా చదివిన తీర్మానం సభలో తీవ్ర దుమారం రేపింది. ఎమర్జెన్సీని ఖండిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాలని ఆయన కోరారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు లేచి నిల్చుని స్పీకర్‌ ఎమర్జెన్సీ ప్రస్తావనను తప్పుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

‘1975 జూన్‌ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 26వ తేదీన ప్రజలు నిద్దురలేవగానే దాని చేదు నిజాలను చవి చూశారు. పలువురు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. మీడియాపై ఆంక్షలు విధించింది. న్యాయ వ్యవస్థపైనా నియంత్రణలు అమలు చేసింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈ సభ బాబాసాహెబ్‌ రాజ్యాంగాన్ని రక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని హామీ ఇస్తున్నా’ అని స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. నాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అత్యయిక స్థితిని ఎదిరించిన వారిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దామని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. స్పీకర్‌ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్‌ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మౌనం పాటిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు.  

స్వాగతించిన ప్రధాని

సభలో స్పీకర్‌ ఎమర్జెన్సీ ప్రస్తావన తేవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఆ సమయంలో రాజ్యాంగ విలువలను అణగదొక్కడాన్ని ఇప్పటి యువతకు తెలియజేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వ్యవస్థలు ఎలా విధ్వంసమయ్యాయో తెలుసుకోవాలని పేర్కొన్నారు. 

ఎమర్జెన్సీని నిరసిస్తూ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అడ్డుకోవడంద్వారా కాంగ్రెస్‌ తన ప్రజాస్వామ్య వ్యతిరేకతను బయటపెట్టుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.  

ఎన్డీయే ఎంపీల నిరసన

ఎమర్జెన్సీని నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో బుధవారం ఎన్డీయే ఎంపీలు ఆందోళన చేశారు. ఇందులో కేంద్ర మంత్రులూ పాల్గొన్నారు. సభ వాయిదా అనంతరం భారీ ఎత్తున ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్‌ జోషి, కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రాం మేఘ్‌వాల్, గజేంద్ర సింగ్‌ శెఖావత్, లలన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేడు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం

కొత్తగా కొలువుదీరిన లోక్‌సభతోపాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ ప్రాధమ్యాలను ఆమె వివరించనున్నారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి రానున్న ముర్ముకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌లు స్వాగతం పలికి సభలోకి తోడ్కొని వెళ్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 87 ప్రకారం.. లోక్‌సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. గత పదేళ్లలో చేపట్టిన పథకాలతోపాటు రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధమ్యాలను ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని