NEET Row: నీట్‌పై చర్చకు విపక్షాల పట్టు

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది.

Updated : 29 Jun 2024 05:49 IST

దద్దరిల్లిన ఉభయసభలు

దిల్లీ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి, నీట్‌పై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ అందుకు అంగీకరించకపోవటంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం నెలకొనటంతో సభను మధ్యాహ్నం వరకు ఓసారి, ఆ తర్వాత సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. 

వెనక్కి తగ్గని ప్రతిపక్షాలు

నీట్‌ పరీక్ష లక్షల మంది విద్యార్థులకు సంబంధించినదని, దానిపై చర్చకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ సమావేశం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలు నిలిపి నీట్‌పై చర్చించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఎంపీలు వెల్‌లోకి చొచ్చుకెళ్లారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈ అంశాన్ని లేవనెత్తవచ్చని, తగినంత సమయం కూడా ఇస్తామని స్పీకర్, పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపినా, ప్రతిపక్ష సభ్యులు వినలేదు. నినాదాలు చేస్తూ  ఎంతకీ శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు ఆ తర్వాత సోమవారానికి వాయిదా వేశారు. మరోపక్క గందరగోళ పరిస్థితుల్లోనే టీఎంసీ సభ్యుడు ఎస్‌.కె.నురల్‌ ఇస్లాం లోక్‌సభ సభ్యుడిగా శుక్రవారం ప్రమాణం చేశారు. 

ప్రభుత్వానిది సరైన నిర్ణయం: దేవేగౌడ

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించడం సరైన నిర్ణయమని జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ శుక్రవారం రాజ్యసభలో పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తికాకుండా ప్రభుత్వం బాధ్యులను తేల్చలేదని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు సభ నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


చర్చకు సిద్ధం : ధర్మేంద్ర ప్రధాన్‌

నీట్‌పై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం ప్రకటించారు. అయితే అది సంప్రదాయం, పద్ధతి ప్రకారం సాగాలని పేర్కొన్నారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులను అయోమయానికి గురిచేయొద్దని ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. 


చర్చ జరగాల్సిందే: రాహుల్‌

అంతకుముందు ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నీట్‌ పేపర్‌ లీక్‌ సమస్య.. దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశం. దానిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోదీ చేపట్టాలి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంట్‌ ఇవ్వాలి’’ అని అన్నారు.


రాజ్యసభలోనూ వాయిదాల పర్వం

నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం వల్ల రాజ్యసభ కార్యకలాపాలు కూడా వాయిదా పడ్డాయి. నీట్‌ సమస్యపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదించలేదు. చర్చ డిమాండ్‌ను ఆమోదించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరినా ఛైర్మన్‌ అంగీకరించలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులు తిరిగి తమ స్థానాల్లో కూర్చోవాలని ఛైర్మన్‌ కోరినా వారు నిరాకరించారు. సీనియర్‌ నేత ఖర్గే కూడా వెల్‌లోకి చొచ్చుకు రావడంపై ధన్‌ఖడ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల నడుమ కొంతసేపు ఛైర్మన్‌ సభను నడిపించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో సభను పలుమార్లు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. చివరకు వారు వాకౌట్‌ చేయడంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను కొనసాగించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ ఎంపీ ఫూలో దేవీ నేతాం కళ్లుతిరిగి పడిపోయారు. ఆసుపత్రిలో చేరిన ఆమె కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారని ధన్‌ఖడ్‌ సభకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని