Lok Sabha Speaker: ఓం బిర్లాయే సభాపతి

నూతన లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక బుధవారం కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. రాజస్థాన్‌లోని కోటా స్థానం నుంచి భాజపా తరఫున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్‌ అయ్యారు.

Published : 27 Jun 2024 02:42 IST

12 నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ
మూజువాణి ఓటుతో నిర్ణయం
డివిజన్‌ కోరని ప్రతిపక్షాలు

లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు

ఈనాడు, దిల్లీ: నూతన లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక బుధవారం కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. రాజస్థాన్‌లోని కోటా స్థానం నుంచి భాజపా తరఫున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్‌ అయ్యారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు. ప్రతిపక్షానికి ఉప సభాపతి పదవిని ఇవ్వడానికి ఎన్డీయే కూటమి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇండియా కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా కేరళ ఎంపీ కొడికున్నిల్‌ సురేశ్‌ను బరిలోకి దింపింది. మాడభూషి అనంతశయనం అయ్యంగార్, గుర్దయాల్‌సింగ్‌ థిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్‌ పదవి చేపట్టిన వ్యక్తిగా బిర్లా రికార్డు సృష్టించారు. తొలి విడతలో ఐదేళ్లు పూర్తిచేసి వరసగా రెండోసారి స్పీకర్‌ పదవి చేపట్టిన తొలివ్యక్తి బలరాం జాఖడ్‌ కాగా ఓంబిర్లా ఆ కోవలో రెండోవారు. 

తీర్మానాన్ని ప్రతిపాదించిన ప్రధాని 

ఉదయం సభ ప్రారంభమైన వెంటనే తొలిరెండు రోజుల్లో ప్రమాణం చేయలేకపోయిన సభ్యులు ప్రమాణం పూర్తిచేశాక.. సభాధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రారంభించారు. ఓంబిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ సహా పలువురు బలపరిచారు. వీరిలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు (తెదేపా), లావు శ్రీకృష్ణదేవరాయలు (తెదేపా), వల్లభనేని బాలశౌరి (జనసేన) కూడా ఉన్నారు. ప్రతిపక్ష అభ్యర్థి సురేశ్‌ పేరును విపక్షాలు ప్రతిపాదించాయి. మహతాబ్‌ మూజువాణి ఓటింగ్‌ ద్వారా సభ్యుల అభిప్రాయం కోరి, అత్యధికమంది ఓంబిర్లాకు మద్దతు పలికినట్లు తేల్చారు. ప్రతిపక్ష సభ్యులెవ్వరూ లేచి డివిజన్‌ (ఓటింగ్‌) కోరకపోవడంతో ఓంబిర్లా పేరుపై తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు ప్రకటించారు. స్పీకర్‌ స్థానంలో ఆశీనులు కావాల్సిందిగా ఓంబిర్లాను ఆయన ఆహ్వానించారు. 

ఓం బిర్లాను స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టడానికి ముందు రాహుల్‌గాంధీతో ప్రధాని మోదీ కరచాలనం

మీ గెలుపు చరిత్రాత్మకం.. మీ చిరునవ్వుతో సభలో ఆనందం

నూతన ఎంపీలకు ఓం బిర్లా స్ఫూర్తినిస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన సుమధుర చిరునవ్వు సభను ఆనందంగా ఉంచుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు స్పీకర్‌ కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. ‘‘గత రెండు దశాబ్దాల్లో స్పీకర్‌గా ఎన్నికైనవారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమో, పోటీచేసినా నెగ్గకపోవడమో జరిగేది. ఒకసారి స్పీకర్‌గా చేసి, ఎన్నిక ద్వారా మళ్లీ గెలిచి మీరు (బిర్లా) చరిత్ర సృష్టించారు. స్పీకర్‌ పదవి ఎంత కఠినమైందో మీకు బాగా తెలుసు. సభను సరైన దిశలో నడపడంలో స్పీకర్‌ది కీలక పాత్ర. లోక్‌సభ చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహించారు. స్పీకర్‌గా మీ పదవీకాలంలో అనేక కీలక, చరిత్రాత్మక బిల్లుల్ని సభ ఆమోదించింది. గత ఐదేళ్లలో 97శాతం పనితీరు నమోదు చేసింది. పాతికేళ్లలోనే ఇది అత్యధికం కావడం విశేషం’’ అని ప్రశంసలు కురిపించారు. 

జనవాణిని సభ ప్రతిబింబించాలన్న రాహుల్‌ 

గత ఐదేళ్లలో సభను ఓంబిర్లా నడిపించిన తీరును, కొత్త సభ్యులను ప్రోత్సహించడాన్ని ఎన్డీయే కూటమి సభ్యులు కొనియాడారు. మాట్లాడేందుకు తమకూ తగిన అవకాశాలు ఇవ్వాలని విపక్ష సభ్యులు కోరారు. బిల్లులను హడావుడిగా కాకుండా స్థాయీ సంఘాలకు పంపి లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ఆమోదించాలని, తామరాకు మీద నీటిబొట్టులా స్పీకర్‌ వ్యవహరించాలని, నిష్పాక్షికంగా ఉండాలని కోరారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ- ‘‘ఈ సభ భారతదేశ జనవాణిని ప్రతిబింబించాలి. సభ సజావుగా నడపడంలో ప్రతిపక్షం మీకు పూర్తి సహకారం అందిస్తుంది. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు విపక్షాలకు అవకాశమిస్తారని ఆశిస్తున్నా. విపక్షం గొంతు నొక్కడం ద్వారా సభను నడపడం అప్రజాస్వామికం అవుతుంది. మాకు మాట్లాడే అవకాశం ఇస్తారని విశ్వాసంతో ఉన్నాం’’ అని చెప్పారు. విపక్షాల తరఫున మాట్లాడినవారిలో అఖిలేశ్‌యాదవ్, టి.ఆర్‌.బాలు, సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ తదితరులు ఉన్నారు. ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్‌ వంటివి పునరావృతం కాకూడదని వారు ఆకాంక్షించారు. చిన్న పార్టీలకూ అవకాశం ఇవ్వాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కోరారు. 

అందరి వాణి వినడమే ప్రజాస్వామ్య బలం 

చివరగా స్పీకర్‌ ప్రసంగించారు. అందరి వాణి వినడంలోనే భారత ప్రజాస్వామ్య బలం దాగి ఉందని అన్నారు. ఒక్క సభ్యుడున్న పార్టీకి కూడా తగిన సమయం లభించేలా చూస్తానని భరోసా ఇచ్చారు. విమర్శలు ఉండవచ్చు గానీ ఆటంకాలు కల్పించడం సభా సంప్రదాయం కాదన్నారు. ఎవరికీ వ్యతిరేకంగా వ్యవహరించాలని తనకు ఉండదని, కొన్నిసార్లు పార్లమెంటు ప్రమాణాలను నిలబెట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుందని చెప్పారు. సభకు ఈసారి అవాంతరాలు కలిగించకుండా ఉభయపక్షాలూ చూస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. 

అభినందించిన చంద్రబాబు 

ఈనాడు డిజిటల్, అమరావతి: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పార్లమెంటరీ సంప్రదాయాల్ని నిలబెట్టి.. చిత్తశుద్ధి, విజ్ఞతతో సభను నడిపించడంలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.


తోడ్కొని వెళ్లిన మోదీ, రాహుల్, రిజిజు  

ప్రధాని మోదీ అధికారపక్షం నుంచి, ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ విపక్ష స్థానాల నుంచి లేచి ఓంబిర్లా వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ, రాహుల్‌ కరచాలనం చేసుకున్నారు. తర్వాత వారిద్దరూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజుతో కలిసి ఓంబిర్లాను స్పీకర్‌ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. ప్రొటెం స్పీకర్‌ సభాధ్యక్ష స్థానం నుంచి లేచి ఆయన్ని కూర్చోబెట్టారు. మొత్తం వ్యవహారం 11.03 గంటలకు మొదలై 11.15కి ముగిసిపోయింది. తమకు చెప్పకుండా స్పీకర్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ ప్రకటించడాన్ని తప్పుబట్టిన తృణమూల్‌ కాంగ్రెస్‌.. ఓటింగ్‌ సమయంలో మద్దతు పలుకుతుందో లేదోనన్న సంశయంతో కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌ సమయంలో డివిజన్‌ కోసం పట్టుబట్టలేదు. దాంతో ఉత్కంఠ రేపిన స్పీకర్‌ ఎన్నిక ప్రశాంతంగా సాగిపోయింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని