NEET-UG: నీట్‌ రీ-టెస్ట్‌ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా

NEET-UG 2024: నీట్‌ రీటెస్ట్‌ ఫలితాలను ఎన్‌టీఏ సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్‌ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు వెల్లడించింది.

Updated : 01 Jul 2024 11:09 IST

దిల్లీ: వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు (NEET Row) చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈక్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని రద్దు చేసి ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించారు. వారి ఫలితాలను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్‌ యూజీ 2024 (NEET-UG 2024) అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు (Revised Rank List) వెల్లడించింది.

సవరించిన స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

మొత్తం 1,563 మందికి మళ్లీ పరీక్ష (NEET Re-Test) నిర్వహించగా.. 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు ఎన్‌టీఏ (NTA) అధికారులు వెల్లడించారు. ఆ రీ-ఎగ్జామ్‌ ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్ష ఫైనల్‌ ఆన్సర్‌ కీని నీట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు. ఈ ఫలితాల తర్వాత నీట్‌ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. సవరించిన స్కోర్‌ కార్డులను https://exams.nta.ac.in/NEET/లో చూసుకోవచ్చు. త్వరలోనే నీట్‌ కౌన్సెలింగ్ జరగనుంది.

నీట్‌-యూజీ 2024 పరీక్షా (Neet Exam) ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో కొందరు అభ్యర్థులు, పలు సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష రోజున కొన్ని కేంద్రాల్లో సమయం కోల్పోయిన అభ్యర్థులకు గ్రేస్‌ మార్కులు కలపడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవ్వగా.. గ్రేస్‌ మార్కులు కలిపిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలాఉండగా.. నీట్‌ పరీక్షలో పేపర్‌ లీక్‌ జరిగిన ఆరోపణలు కూడా దుమారం రేపుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు