Stubble Burning: ‘దిల్లీలో కాలుష్యానికి.. పంజాబ్‌ రైతులపై చర్యలు అన్యాయం’

పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనం ఘటనలు దిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ అధ్యయనాలు లేవని ఎన్జీటీ సభ్యుడు జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ తెలిపారు.

Published : 03 Jul 2024 00:04 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi), పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం (Stubble Burning) దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. అయితే.. పంజాబ్‌ (Punjab)లో పంట వ్యర్థాల దహనం ఘటనలు దిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ అధ్యయనాలు లేవని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) జ్యుడిషియల్‌ సభ్యుడు జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనాల విషయంలో అక్కడి రైతులకు జరిమానాలు విధించడం, జైలుపాలు చేయడాన్ని తీవ్ర అన్యాయంగా పేర్కొన్నారు. దిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడం అందరి బాధ్యత అని దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చెప్పారు.

ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటి?

‘‘దిల్లీలో వాయు కాలుష్యానికి.. పంట వ్యర్థాల దహనాన్ని ఓ ప్రధాన కారణంగా చెబుతుంటారు. అయితే, పంజాబ్‌.. దిల్లీ పొరుగునే లేదు. పంట వ్యర్థాల పొగ ఆ రాష్ట్రం నుంచి దేశ రాజధానికి చేరుకోవాలంటే నిర్దిష్ట గాలి వేగం, దిశ అవసరం. పైగా.. పంజాబ్ నుంచి వచ్చే గాలులు హరియాణాను కలుషితం చేయవేం? ఇలా ఆరోపణలు చేసేముందు ఈ విషయంపై శాస్త్రీయ పరిశోధనలు ఏమైనా చేశారా? దిల్లీ వాయు కాలుష్యం జిడ్డుగా ఉంటుంది. పంట అవశేషాల్లో ఈ కారకాలు ఉండే అవకాశమే లేదు. ప్రతీ విషయానికి రైతులను బాధ్యులుగా నిలబెట్టడం నాకు అర్థం కాని విషయం’’ అని జస్టిస్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి అసలైన కారణం వేరేది ఉందని చెప్పారు. రైతులను బాధ్యులను చేయడం వెనుక ఏదైనా రాజకీయ కారణాలు ఉండొచ్చేమో.. తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని