New criminal laws: అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు

కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు.

Updated : 02 Jul 2024 06:33 IST

దిల్లీ: కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. దీనివల్ల నేరాల సంఖ్య తగ్గిపోతుందని, నమోదైన కేసుల్లో 90శాతం వాటికి శిక్షలుపడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఈ సందర్భంగా దిల్లీలో అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. కొత్త చట్టాల ఆవశ్యకతను, ప్రాధాన్యాన్ని వివరించారు. 

‘క్రిమినల్‌ కేసుల్లో విచారణ ప్రారంభమైన తర్వాత 60 రోజుల్లోగా అభియోగాలు మోపాలి. విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పులు వెలువడాల్సి ఉంటుంద’ని తెలిపారు. కొత్త చట్టాలపై విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. ‘కొత్త న్యాయ చట్టాలపై లోక్‌సభలో 9.30 గంటలు, రాజ్యసభలో 6 గంటలు చర్చించాం. నాలుగు సంవత్సరాల చర్చ తర్వాతే వాటిని తీసుకువచ్చాం. ఇప్పటికీ సందేహాలుంటే విపక్ష ఎంపీలు నన్ను కలవచ్చు. వారితో చర్చించటానికి, సందేహాలు తీర్చడానికి, సిద్ధంగా ఉన్నాన’ని అమిత్‌ షా తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత దేశానికి పూర్తిస్థాయి స్వదేశీ న్యాయవ్యవస్థ లభించిందన్నారు. ఆధునిక కాలానికి తగినట్లుగా నేరాల నమోదు, దర్యాప్తు, విచారణలో ఎన్నో మార్పులను తీసుకువచ్చినట్లు తెలిపారు. భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులో గుర్తించిన అన్ని భాషలలోనూ కొత్త చట్టాలు అందుబాటులో ఉంటాయని ఓ ప్రశ్నకు అమిత్‌ షా సమాధానమిచ్చారు. 

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

కొత్త న్యాయ చట్టాల అమలులో ఎదురయ్యే ఇబ్బందులు, తలెత్తే సందేహాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్‌ విభాగాలు, న్యాయాధికారులు, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు దిల్లీలో కంట్రోల్‌ రూమ్‌ అందుబాటులోకి వచ్చింది. పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం (బీపీఆర్‌డీ) ప్రధాన కార్యాలయంలో ఇది ఏర్పాటయ్యింది. కేంద్ర హోంశాఖ మార్గనిర్దేశంలో పనిచేస్తుంది.


గ్వాలియర్‌లో తొలి కేసు నమోదు

కొత్త చట్టాల కింద అదివారం అర్ధరాత్రి 12.10 గంటలకు గ్వాలియర్‌లో తొలి కేసు నమోదైందని, అది ద్విచక్ర వాహన దొంగతనానికి సంబంధించినదని హోంమంత్రి తెలిపారు. దీనికి ముందు దిల్లీలో వీధి వ్యాపారిపై కేసు నమోదైనప్పటికీ దర్యాప్తు తర్వాత పోలీసు అధికారులు దానిని తొలగించారని స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని