NEET row: నీట్‌పై 26 పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం కోర్టు విచారణ

నీట్‌ వివాదంపై దాఖలైన అనేక పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది.

Published : 02 Jul 2024 16:35 IST

దిల్లీ: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 26 పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో తాజా అప్‌డేట్‌ వచ్చింది.

NTA: పారదర్శకతకు పాతర! ఆది నుంచీ విమర్శలు

నీట్‌-యూజీ (NEET Row) పేపర్‌ లీకేజీ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని జూన్‌ 11న సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. పరీక్ష పవిత్రత దెబ్బతిందని వ్యాఖ్యానించింది. అయితే, కౌన్సెలింగ్‌ను నిలిపివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)ను ఆదేశించింది. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలతో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్‌-యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్‌ 14న వెల్లడించాలని ఎన్‌టీఏ భావించినప్పటికీ.. ముందస్తుగానే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో జూన్‌ 4నే ఫలితాలు వెల్లడించింది. అయితే, పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీకేజీ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమయ్యింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ.. బిహార్‌లో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు