NEET Row: నీట్‌ కేసులో సీబీఐ దూకుడు

నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. గురువారం బిహార్‌లోని పట్నాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. సీబీఐ అధికారుల వివరాల ప్రకారం..

Updated : 28 Jun 2024 06:06 IST

పట్నాలో ఇద్దరి అరెస్టు 
గోధ్రాలోనూ వాంగ్మూలాల నమోదు
ఓఎంఆర్‌ షీట్లపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. గురువారం బిహార్‌లోని పట్నాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. సీబీఐ అధికారుల వివరాల ప్రకారం.. నిందితుల్లోని అశుతోష్‌ కుమార్‌ పట్నాలో ఓ హాస్టల్‌ను అద్దెకు తీసుకున్నారు. ఆ హాస్టల్‌లోనే బిహార్‌ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి సగం కాలిన నీట్‌ యూజీ ప్రశ్నపత్రాలు దొరికాయి. అక్కడే కొంత మంది నీట్‌ అభ్యర్థులకు ప్రశ్నపత్రం ముందుగా నిందితులు అందించారు. మరో నిందితుడు మనీశ్‌ కుమార్‌.. ప్రశ్నపత్రం కోసం కొంత మంది నీట్‌ అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. తర్వాత వారిని పరీక్షకు ముందు రోజు హాస్టల్‌కు తీసుకువచ్చి ప్రశ్నపత్రం, సమాధానాల కీ ఇచ్చాడు. నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి సీబీఐ మొత్తం ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. అరెస్టు చేసిన ఇద్దరిని సీబీఐ పట్నాలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. నిందితులను జ్యుడిషియల్‌ కస్టడీకి పంపుతూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్‌లోని గోధ్రాలోనూ సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ప్రశ్నపత్రం కోసం డబ్బులిచ్చిన ముగ్గురు విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వారి తల్లిదండ్రులను ప్రశ్నించారు. నీట్‌ యూజీకి పరీక్ష కేంద్రంగా నిలిచిన జై జలారామ్‌ పాఠశాల యజమాని దీక్షిత్‌ పటేల్‌నూ విచారించారు.

ఎన్‌టీఏకు సుప్రీం నోటీసులు

నీట్‌-యూజీ-2024 ఓఎంఆర్‌ షీట్ల విషయంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పరీక్షకు హాజరైన కొందరు విద్యార్థులకు ఓఎంఆర్‌ షీట్లు అందలేదని ఓ కోచింగ్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఓఎంఆర్‌ షీట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నిర్ణీత కాలవ్యవధి ఏమైనా ఉంటుందా.. అని ఎన్‌టీఏను ప్రశ్నించింది. సమాధానం చెప్పడానికి గడువు కావాలని ఎన్‌టీఏ తరఫు న్యాయవాది కోరడంతో నీట్‌ యూజీపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి వచ్చే నెల 8న విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు కోచింగ్‌ సంస్థ పిటిషన్‌ దాఖలు చేయడాన్ని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ‘‘ఇది కోచింగ్‌ సెంటర్ల వైపు నుంచి వచ్చిన 32వ పిటిషన్‌. ఇందులో మీ ప్రాథమిక హక్కులకు ఏం ఉల్లంఘన జరిగింది..? ఈ అంశంలో కోచింగ్‌ సెంటర్ల పాత్ర కనిపించడం లేదు. కేంద్రం ఏం చేస్తుందో చూడాల్సిన పని వారికి లేదు. ఆ పని కేంద్రం చూసుకుంటుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు నీట్‌ యూజీలో సిలబస్‌లో లేని ప్రశ్నలు అడిగారంటూ ఓ విద్యార్థి వేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు కూడా ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. 


ఎన్‌టీఏ కేంద్ర కార్యాలయంలో ఉద్రిక్తత

యూజీసీ నెట్, నీట్‌ యూజీ పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలకు నిరసనగా గురువారం నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ)కు చెందిన కార్యకర్తలు జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ  (ఎన్‌టీఏ) కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అక్కడ తలుపులకు తాళం వేశారు. ఎన్‌టీఏను మూసివేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యాలయంవైపు పరిగెడుతున్న ఆందోళనకారుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్‌టీఏకు వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ దగ్గర జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు రెండో రోజైన గురువారమూ కొనసాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని