NEET Row: నీట్‌ కేసు.. గుజరాత్‌లో ఏడుచోట్ల సీబీఐ సోదాలు

వైద్యవిద్య అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్‌-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్‌లో ఏడుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సోదాలు నిర్వహించింది.

Updated : 30 Jun 2024 05:53 IST

దిల్లీ: వైద్యవిద్య అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్‌-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్‌లో ఏడుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సోదాలు నిర్వహించింది. జమాలుద్దీన్‌ అన్సారీ అనే హిందీ పాత్రికేయుడిని ఝార్ఖండ్‌లో అరెస్ట్‌ చేసింది. ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న హజారీబాగ్‌ పాఠశాల ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్‌లకు సాయపడేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ ఆయనపై ఉంది. గుజరాత్, రాజస్థాన్, బిహార్, దిల్లీ, ఝార్ఖండ్‌లకు విస్తరించిన విస్తృత కుట్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. గోధ్రాలో నీట్‌-యూజీ పరీక్ష అవకతవకల్లో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఒక పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు, ఇద్దరు దళారులను నాలుగు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఆదేశాలిచ్చింది. అసలైన కుట్రదారుల్ని పట్టుకునేందుకు వీరిని విచారించాల్సి ఉందని సీబీఐ తెలిపిన మీదట న్యాయస్థానం అంగీకరించింది. 

పరీక్ష కేంద్రం గోధ్రా.. భాష గుజరాతీ

గోధ్రా, ఖేడాల్లో పరీక్ష కేంద్రాలుగా ‘జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ’ (ఎన్‌టీయే) ఎంచుకున్నవి ఒకే పాఠశాల యాజమాన్యంలో ఉన్నాయని సీబీఐ దర్యాప్తులో బయటపడింది. ఒడిశా, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో తమకు కావాల్సిన అభ్యర్థుల చేత పరీక్ష కేంద్రంగా గోధ్రాను, భాషగా గుజరాతీని నిందితులు ఎంపిక చేయించారని తెలుస్తోంది.  


రెండ్రోజుల్లో పీజీ పరీక్ష తేదీ ప్రకటిస్తాం

నీట్‌-యూజీ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ముందుజాగ్రత్తగా వాయిదా వేసిన నీట్‌ పీజీ పరీక్షను ఎప్పుడు నిర్వహించేదీ జాతీయ పరీక్షల మండలి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం పంచ్‌కులలో విలేకరులకు తెలిపారు. నీట్‌పై పార్లమెంటులో చర్చ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని