Deputy Speaker: డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎన్డీయేకే..!

Deputy Speaker: లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవినీ ఎన్డీయే ఎంపీనే చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.

Published : 27 Jun 2024 18:09 IST

దిల్లీ: 18వ లోక్‌సభ (18th Lok Sabha) స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ పదవికి ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. కాగా.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌ (Deputy Speaker) పదవినీ తమ కూటమి ఎంపీకే ఇవ్వాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఈ ఉప సభాపతి పదవి కారణంగానే స్పీకర్‌ పదవిని ఎన్నిక అనివార్యమైంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో లోక్‌సభలో తమ బలాన్ని పెంచుకున్న విపక్ష ఇండియా కూటమి (INDIA Alliance).. డిప్యూటీ స్పీకర్‌ పదవికి పట్టుబట్టింది. ఉపసభాపతి పదవి తమకు ఇస్తే.. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేస్తామని ప్రతిపక్షాలు కండీషన్‌ పెట్టాయి. ఇందుకు ఎన్డీయే (NDA) కూటమి నిరాకరించింది. అయితే, ఇప్పుడు భాజపా లేదా దాని మిత్రపక్షాలకు చెందిన నేతనే ఉప సభాపతిగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ ఎంపీ ఎవరనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ స్పీకర్‌ పదవికీ విపక్షాలు పోటీపడితే.. అప్పుడు ఎన్నిక నిర్వహిస్తారు.

పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు: పార్లమెంట్‌ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

2014లో మోదీ సర్కారు ఎన్నికైన తర్వాత సుమిత్రా మహజన్‌ స్పీకర్‌గా వ్యవహరించగా.. అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై ఉపసభాపతి (Deputy Speaker) పదవి చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్డీయే రెండోసారి విజయం సాధించిన డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఖాళీగా ఉంచారు. ఈసారి ఎన్డీయే మిత్రపక్షాలకు ఆ పదవిని కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని