Karnataka: ‘ఎమర్జెన్సీ’ బంపర్‌ గిఫ్ట్‌..! కర్ణాటకలో పాల ధరల పెంపుపై ప్రతిపక్షాల ఎద్దేవా

కర్ణాటకలో నందిని పాల ధరల పెంపు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో విమర్శలకు దారితీసింది.

Updated : 25 Jun 2024 18:34 IST

బెంగళూరు: నందిని పాల ధరలను పెంచుతూ ‘కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (KMF)’ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇటీవలే కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన వేళ ఈ నిర్ణయం వెలువడింది. ఈ వ్యవహారం కాస్త రాష్ట్ర రాజకీయాల్లో విమర్శలకు దారితీసింది. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వమే దీనికి కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా.. అది సంస్థ స్వతంత్ర నిర్ణయమంటూ సిద్ధరామయ్య సర్కారు కొట్టిపారేసింది.

‘‘ఒక్కో పాల ప్యాకెట్‌పై ధరను రూ.2 చొప్పున పెంచుతున్నాం. ప్రతి అర లీటర్, లీటర్‌ ప్యాకెట్‌లపై అదనంగా 50 మిల్లీలీటర్లు అందజేస్తాం’’ అని కేఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 500 ఎంఎల్‌ టోన్డ్ పాల ప్యాకెట్‌ ధర రూ.22గా ఉంది. బుధవారం నుంచి దీన్ని 550 ఎంఎల్‌కు పెంచి రూ.24కు విక్రయించనుంది. లీటర్‌ ప్యాకెట్‌ను 1050 ఎంఎల్‌కు పెంచి, రూ.44 చేయనుంది. నందిని బ్రాండ్‌ కింది ఇతర కేటగిరీల పాల ధరలూ పెరగనున్నాయి.

నాడు ఎమర్జెన్సీ విధించి.. నేడు రాజ్యాంగంపై ‘ప్రేమ’ నాటకాలా?: మోదీ

పాల ధరల పెంపు నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ‘ఎమర్జెన్సీ’ గోల్డెన్‌ జూబ్లీ పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ‘బంపర్‌ గిఫ్ట్’ ఇచ్చిందంటూ జేడీఎస్‌ ఎద్దేవా చేసింది. పెరిగిన ఇంధన ధరలతో కుదేలవుతోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని శాసనసభలో ప్రతిపక్ష నేత ఆర్.అశోక, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రలు విమర్శించారు. అయితే.. ధరల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదని, కేఎంఎఫ్‌తో మాట్లాడతానని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని