Ayodhya: అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’

అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’ నిర్మాణానికి టాటా సన్స్‌ చేసిన ప్రతిపాదనకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

Published : 26 Jun 2024 06:20 IST

టాటా సన్స్‌ ప్రతిపాదనకు యూపీ క్యాబినెట్‌ ఆమోదం 

లఖ్‌నవూ: అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’ నిర్మాణానికి టాటా సన్స్‌ చేసిన ప్రతిపాదనకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఆ రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు ఆమోదించారు. అనంతరం సంబంధిత వివరాలను పర్యావరణ శాఖ మంత్రి జైవీర్‌ సింగ్‌ వెల్లడించారు. ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’ కోసం రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నామన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌)లో భాగంగా టాటా సన్స్‌ ప్రతినిధులు గతంలోనే తమ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. దీంతోపాటు టెంపుల్‌ సిటీ అయోధ్యలో మరో రూ.100 కోట్లతో టాటా సన్స్‌ చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకూ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పురాతన చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రాంతాలుగా మెరుగులు దిద్దడంతోపాటు లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్, కపిలవాస్తు ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని