Mumbai hoarding collapse: హోర్డింగ్‌ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్‌ ఏజెన్సీపై కేసు

Mumbai hoarding collapse: బలమైన ఈదురుగాలుల ధాటికి సోమవారం ముంబయిలోని భారీ హోర్డింగ్ ఒకటి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు.

Updated : 14 May 2024 11:22 IST

ముంబయి: ముంబయిలో హోర్డింగ్‌ కూలిన (Mumbai hoarding collapse) ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని ముంబయి పోలీస్‌ కమిషనర్‌ వివేక్‌ ఫన్సాల్కర్‌ తెలిపారు.

ఇప్పటికే ‘ఇగో మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ యాడ్‌ ఏజెన్సీ యజమాని భవేశ్‌ భిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కూలిన హోర్డింగ్‌ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బలమైన ఈదురు గాలుల ధాటికి ఘట్‌కోపర్‌లోని సమతా నగర్‌లో సోమవారం 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్‌ పక్కనే ఉన్న పెట్రోల్‌ పంపుపై కూలిన (Mumbai hoarding collapse) విషయం తెలిసిందే. ఈ హోర్డింగ్‌కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించడం గమనార్హం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నగరంలోని అన్ని హోర్డింగ్‌లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన వాటితో పాటు ముప్పు పొంచి ఉన్న అన్నింటినీ తొలగించాలన్నారు. తాజా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. కారకులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని