Mumbai: టీషర్ట్‌, చిరిగిన జీన్స్‌ ధరించి కాలేజీకి రావొద్దు!

ఇటీవల తమ కాలేజీల్లో హిజాబ్‌పై నిషేధం విధించిన ముంబయిలోని ఓ విద్యాసంస్థ.. తాజాగా చిరిగిన జీన్‌ ప్యాంట్‌, టీషర్ట్‌లపైనా ఆంక్షలు విధించింది.

Updated : 02 Jul 2024 17:28 IST

ముంబయి: కళాశాల ఆవరణలో ఇటీవల విద్యార్థులు హిజాబ్‌ ధారణను నిషేధించి వార్తల్లో నిలిచిన చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ.. తాజాగా టీషర్ట్‌లు, చిరిగిన జీన్స్‌పైనా నిషేధం విధించింది. తమ కాలేజీకి వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబయిలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కాలేజీల్లో చిరిగిన జీన్స్‌, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించబోమని,  ఫార్మల్‌, డీసెంట్‌ దుస్తులతో పాటు హాఫ్‌ లేదా ఫుల్‌ షర్ట్‌, ప్యాంటు ధరించవచ్చని సూచించింది. బాలికలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించినా అభ్యంతరం లేదని పేర్కొంటూ జూన్‌ 27న నోటీసు జారీ చేసింది.

మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్‌ యాదవ్

గత నెలలో కళాశాల ప్రాంగణంలో హిజాబ్‌, బుర్ఖా, నకాబ్‌, టోపీలపై నిషేధించడాన్ని పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధం సబబేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏకరూప వస్త్రధారణ దృష్ట్యా విద్యార్థులు హిజాబ్‌, బుర్ఖా, నకాబ్‌, టోపీలను ధరించకుండా నిషేధం విధించవచ్చని స్పష్టం చేసింది. క్రమశిక్షణలో భాగంగానే డ్రెస్‌కోడ్‌ ఉంటుందని పేర్కొంటూ కాలేజీ యాజమాన్యం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, విద్యార్థులు నకాబ్‌, హిజాబ్‌, బుర్ఖా, క్యాప్‌ వంటివి ధరించి కాలేజీ వరకు వచ్చినా..  కాలేజీలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కామన్‌ రూమ్‌లోకి వెళ్లి వాటిని మార్చుకొని తమ పనులు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, 75శాతం హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు.  అయితే, ఈ ఆదేశాలు కొత్తగా ఇచ్చినవేం కాదని.. ఈ ఏడాది ఆరంభంలోనే జారీ చేసినట్లు కళాశాల పాలకమండలి ప్రధాన కార్యదర్శి సుబోధ్‌ ఆచార్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని