Mumbai Airport: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 27 విమానాల దారి మళ్లింపు..!

ముంబయిలో వర్షాలు ఎయిర్‌ పోర్టు  కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 27 విమానాలను దారి మళ్లించారు.   

Updated : 08 Jul 2024 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయిలో భారీ వర్షాల ప్రభావం ఎయిర్‌ పోర్టు (Mumbai Airport)పై తీవ్రంగా ఉంది. కొద్దిసేపు రన్‌వే కార్యకలాపాలను సస్పెండ్‌ చేయగా.. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఇవి హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ఇండోర్‌ వంటి ప్రాంతాల్లో ల్యాండ్‌ అయ్యాయి. ఉదయం 11 గంటల సమయానికి 50కిపైగా విమానాలను రద్దు చేశారు. వీటిల్లో ఎయిర్‌ ఇండియా, ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌, ఖతార్‌ ఎయిర్‌ వేస్‌కు చెందినవి ఉన్నట్లు సమాచారం. 

ఇక తెల్లవారుజామున 2.22 నుంచి 3.40 వరకు రన్‌వేపై కార్యకలాపాలను నిలిపివేశారు. తాము అరైవల్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎయిర్‌ పోర్టు వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం దారి మళ్లించిన విమానాలకు, డిపార్చర్లలో ఆలస్యమైతే అవసరమైన ఏర్పాట్లు చేయడంపైనా దృష్టి పెడతామన్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. 

బయల్దేరే ముందు విమాన సర్వీసు స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని ముంబయి విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ప్రతికూల వాతావరణం, అతిభారీ వర్షాల కారణంగా ప్రయాణికులు తమ విమాన సర్వీసుల అప్‌డేట్‌ను సంబంధిత ఎయిర్‌లైన్స్‌ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ప్రయాణానికి కొద్దిసేపు ముందు విమనాశ్రయానికి చేరుకోవాలి’’ అని సీఎస్‌ఎంఐఏ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. 

ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి (Mumbai) వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్‌లో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా సెంట్రల్‌ రైల్వే సబర్బన్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్‌ రైళ్ల (Local Trains) రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రైల్వేస్టేషన్లలో నిలిచిన నీటిని తొలగించేందుకు శక్తిమంతమైన మోటార్లను ఏర్పాటు చేశారు. కుర్లా వద్ద భారీ వర్షాల కారణంగా రాష్ట్ర మంత్రి అనిల్‌ పటేల్‌ సహా 15 మంది ప్రజాప్రతినిధులు ఒక రైలులో చిక్కుకుపోయారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని