Delhi rainfall: జలమయంగా దిల్లీ: ఎంపీని ఎత్తుకొని వచ్చి.. కారులో కూర్చోబెట్టి..!

దేశ రాజధాని దిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాలకు (Delhi rainfall) పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. 

Published : 28 Jun 2024 17:11 IST

దిల్లీ: భారీ వర్షాలతో(Delhi rainfall) దేశరాజధాని దిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ఎంపీలంతా ప్రస్తుతం నగరంలోనే ఉన్నారు. ఈ వర్షాలతో వారి నివాసాలు కూడా నీటిలో చిక్కుకుపోయాయి. నీటి ఎద్దడి పరిష్కరించాలంటూ ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్‌ నేత, దిల్లీ జలమంత్రి ఆతిశీ ఇల్లు కూడా వాటిల్లో ఉంది. తన ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ ఎక్స్‌(ట్విటర్) వేదికగా వెల్లడించారు.

‘‘నేను నిద్రలేచేసరికి అన్ని గదులు నీటితో నిండిపోయాయి. కార్పెట్స్‌, ఫర్నిచర్‌ సహా నేలమీద ఉన్న సామాన్లన్నీ పాడైపోయాయి. డ్రైనేజీలు మూసుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సమయంలో కరెంట్‌ షాక్‌లను నివారించేందుకు ఉదయం ఆరు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు’’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తాను పార్లమెంట్‌కు సమయానికి వచ్చానని చెప్పారు.

దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!

ఈ వర్షాలతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌ గోపాల్ యాదవ్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోథి ఎస్టేట్ ప్రాంతంలోని నివాసం వద్ద నీరు నిలవడంతో సిబ్బంది ఆయన్ను ఎత్తుకొని కారులో కూర్చోపెట్టారు. పార్లమెంట్‌కు వెళ్లేందుకే ఇదంతా అని యాదవ్ వెల్లడించారు. తన ఇల్లంతా నీటితో నిండిపోయిందని, రెండు రోజుల క్రితం చేసిన ఫ్లోరింగ్ అంతా పాడైపోయిందని చెప్పారు. ఫ్లోరింగ్ కోసం వెచ్చించిన సొమ్మంతా వృథా అయిందన్నారు. నీటిని తోడేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయిందన్నారు.

ఈ పరిస్థితులపై దిల్లీ కౌన్సిలర్, భాజపా నేత రవీందర్ సింగ్ నేగి మాట్లాడుతూ.. ‘‘అన్ని కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలానికి ముందు వాటిలో పేరుకుపోయిన చెత్తను తీయకపోవడమే ఈ పరిస్థితికి కారణం’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని